వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇటు సీబీఐ అధికారులు ఏపీలో తమకు ఎదురవుతున్న పరిస్థితులు.. తాము విచారణ జరపలేకపోతున్న వైనం.. తమపైనే ఎదురు కేసులు పెడుతున్న నిర్వాకం గురించి హైకోర్టుకు మొరపెట్టుకున్నారు. తాజాగా సుప్రీంకోర్టులో ఇలాంటి వాదనే వినిపిస్తూ వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. గత ఆగస్టులో తన తండ్రి హత్య కేసు నిందితులను ప్రభుత్వమే కాపాడుతోందని సీబీఐ విచారణకు ఆటంకాలు కలిగిస్తున్నారని.. సహకరించడం లేదని …కేసు దర్యాప్తు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగాలని.. లేదా ఇతర రాష్ట్రాల్లో విచారణ జరిగేలా చూడాలని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగిది.
ఈ పిటిషన్‌పై అభిప్రాయాలు చెప్పాలని సీబీఐతో పాటు ఏపీ సీఎస్‌కు నోటీసులు జారీ చేశారు. వచ్చే నెల పధ్నాలుగో తేదీన తదుపరి విచారణ జరగనుంది. సీబీఐ ఇప్పటికే సునీత చెప్పిన విషయాలతోనే ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినందున.. సుప్రీంకోర్టులోనూ అదే వాదన వినిపించడం ఖాయమనుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతుందనేది ఇప్పుడు కీలకం. విచారణకు ప్రభుత్వం సహకరించలేదనేది బహిరంగం. నిందితులతో సీబీఐ అధికారులపై ఆరోపణలు చేయించడం.. కేసులు పెట్టించడం అన్నీ జరిగాయి. కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం సీబీఐ అధికారులే కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఇదే వాదన సుప్రీంకోర్టులో కూడా ఏపీ ప్రభుత్వం వినిపిస్తుందా లేకపోతే.. ఎక్కడ దర్యాప్తు చేసుకున్నా తమకు అభ్యంతరం లేదని చెబుతుందా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. సుప్రీంకోర్టు పర్వవేక్షణలో దర్యాప్తు జరగకపోవచ్చని.. గతంలో తమిళనాడు సీఎం అక్రమాస్తుల కేసు విచారణ కర్ణాటకలో జరిగినట్లుగా వైఎస్ వివేకా హత్య కేసును కూడా ఇతర రాష్ట్రాల్లో జరిపించే అవకాశం ఉంటుందని న్యాయవర్గాలు చెబుతున్నాయి.