ముఖ్యమంత్రి రిలీఫ్ పండ్ నుంచి రూ. 117 కోట్లు కొట్టేయాలనుకున్నది ఎవరో ఏసీబీ, సీఐడీ అధికారులు గుర్తించారు. కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన వైసీపీ చోటా నేత భాస్కర్ రెడ్డిగా గుర్తించారు. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి సాయం కావాలంటూ.. కొంత మంది బాధితుల్ని తీసుకెళ్లి తన పలుకుబడిని ఉపయోగించి సాయం వచ్చేలా చేస్తారు. అలా వచ్చిన చెక్కులను.. తానే తీసుకుంటారు. ఆ మేరకు నగదును మాత్రం బాధితులకు ఇస్తారు. కానీ ఆ చెక్కులను మాత్రం.. ఇలా ఫేక్ చెక్కులుగా.. పెద్ద మొత్తంలో ఉన్న అమౌంట్లుగా మార్చి బ్యాంకుల్లో జమ చేసుకుంటున్నట్లుగా గుర్తించారు. గతంలోనూ ఇలా చెక్కులు డ్రా చేసుకున్నట్లుగా దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.
భాస్కర్ రెడ్డి చాలా చిన్న స్థాయి వ్యక్తి. ఆయన ఆలోచనా పరిధి వందల కోట్ల వరకూ వెళ్తుందని దర్యాప్తు సంస్థలు కూడా అనుకోవడం లేదు. దీని వెనుక ఏదో పెద్ద గూడుపుఠాణి ఉంటుందని నమ్ముతున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఏసీబీ అధికారులు నిన్నంతా సచివాలయంలో.. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నిర్వహణ చూసే ఉద్యోగుల్ని ప్రశ్నించారు. గత ఏడాదిన్నర కాలంలో పదిహేను వేల మంది వరకూ.. సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చినప్పటికీ… అందులో పట్టుమని వెయ్యి కూడా.. లక్షకు మించి లేవని.. మిగతావన్నీ.. లక్షలోపేనని వారు వివరించారు. కానీ అదే సమయంలో వివిధ చెక్కుల పేరుతో డ్రా అయిన పెద్ద మొత్తాల వివరాలు తీసుకున్నారు.
భాస్కర్ రెడ్డి ఇలా చెక్కులను ఫేకింగ్ చేసి. ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా బ్రాంచీల్లో ఎలా వేయగలిగాడు..? ఆయన చెక్కులు వేసిన కంపెనీలతో ఆయనకేం సంబంధం..? అసలు ఆ కంపెనీలు సూట్ కేసు కంపెనీలా..? అసలు కంపెనీలా..? అన్న వాటిని వెలికి తీసేందుకు అధికారులు ఆయా ప్రాంతాలకు వెళ్లనున్నారు. సీఐడీ మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు. అసలు భాస్కర్ రెడ్డి చిన్న చేపేనని.. ఆయన వెనుక పెద్ద ముఠా ఉండి ఉంటుందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. సీఎంఆర్ఎఫ్ లెక్కలు అడిట్ చేస్తే.. ఎవరెవరికి ఎంతెంత వెళ్లాయి.. ఎంతెంత డ్రా చేసుకున్నారనేది స్పష్టత వస్తుందని అంటున్నారు.