తెలంగాణా ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఈఒజు ప్రవేశపెట్టిన 2016-17 రాష్ట్ర బడ్జెట్ లో కొన్ని ఆసక్తికరమయిన ప్రతిపాదనలు చేసారు. ఇప్పుడు దేశంలో చాలా మంది షుగర్ వ్యాధి, బ్లడ్ క్యాన్సర్ వంటి రోగాల బారిన పడుతున్నారు. అటువంటి వారిలో కొంత మందికి తరచూ శరీరంలో రక్తం శుద్ధి చేయవలసి వస్తుంటుంది. కానీ రక్తం శుద్ధి చేసే డయాలసిస్ యంత్రాలు మన దేశంలో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండవు. అందుకే తెలంగాణా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 40 చోట్ల డయాలసిస్ సెంటర్లను నెలకొల్పబోతోంది. అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రులలో తుప్పు పట్టిన పాత మంచాలు, పాడయిపోయిన పాత పరుపులు, దుప్పట్లు, ఇతర పరికరాల స్థానంలో కొత్తవి కొనుగోలు చేసేందుకు బడ్జెట్ లో ప్రత్యేక కేటాయింపులు చేసారు. హైదరాబాద్ జంట నగరాలలో నానాటికీ పెరిగిపోతున్న జనాభాని దృష్టిలో ఉంచుకొని నాలుగు సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వాసుపత్రులను నిర్మిస్తామని చెప్పారు.
విద్యాశాఖకు కేటాయించిన రూ. 10, 208 కోట్ల బడ్జెట్ ని ప్రణాళికా వ్యయంగా రూ. 9,044 కోట్లు ప్రణాళికేతర వ్యయంగా రూ. 1,164 కోట్లు కేటాయించడం మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చును.
ఈ బడ్జెట్ లో ప్రధానంగా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, నీటి పారుదల, పంచాయితీరాజ్ శాఖలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేరు. వచ్చే ఎన్నికలలోగా రాష్ట్రంలో మరో కోటి ఎకరాలకు సాగు నీరు అందించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ బృహత్ సంకల్పం ఆయా శాఖల కేటాయింపులలో ప్రస్పుటంగా కనిపించింది. కాళేశ్వరం, సీతారం, పాలమూరు ఎత్తిపోతల పదకాలకి ఈ బడ్జట్ లో బారీగా నిధులు కేటాయించడం, మేడిగడ్డ, పెన్ పహాడ్, లోయర్ పెన్ గంగ, తుమ్మిడిహట్టి, ప్రాణహిత ప్రాజెక్టుల నిర్మాణాలకి బడ్జెట్ లో ప్రతిపాదనలు చేయడం గమనిస్తే తెరాస ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఎంత ప్రాధాన్యత నిస్తోందో అర్ధం చేసుకోవచ్చును. పండ్లు, కూరగాయల పండిచే రైతులకు అండదండలు అందించేందుకు హార్టి కల్చర్ కార్పోరేషన్ ఏర్పాటు చేయడం వంటివి తప్పక పేర్కొనవలసినవే.
తెలంగాణాను ఇన్నేళ్ళుగా పట్టి పీడించిన విద్యుత్ సంక్షోభాన్ని తెరాస అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే చాలా వరకు పరిష్కరించగలిగింది. దానిని శాస్వితంగా నివారించేందుకు వచ్చే మూడేళ్ళలో రాష్ట్రంలో 23,912 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి చురుకుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు బడ్జెట్ లో పేర్కొన్నారు. అదే జరిగితే ఇంతవరకు విద్యుత్ సంక్షోభంతో బాధ పడిన తెలంగాణా రాష్ట్రం కూడా మిగులు విద్యుత్ ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకోవడం తధ్యం.
మంత్రి ఈటెల తన బడ్జెట్ ప్రసంగాన్ని ముగిస్తూ చెప్పిన మాటలు చాలా ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. దేశం లేదా రాష్ట్రం అభివృద్ధికి వనరుల కంటే సుపరిపాలనే ఎక్కువ దోహద పడుతుందని అధ్యయనాల ద్వారా రుజువయింది. మనకి ఆ వనరులతో బాటు బలమైన నాయకత్వం, సుపరిపాలన, అంతులేని ప్రజాభిమానం, ఉన్నాయి కనుక అవన్నీ కలిపి మన రాష్ట్రాన్ని స్థిరంగా, అభివృద్ధి పధంలో ముందుకు తీసుకు వెళ్ళగలవు,” అని తన ప్రసంగాన్ని ముగించారు. నిజమే కదా… పాలకులు అవినీతిపరులో, అసమర్దులో అయితే ఎన్ని వనరులున్నా అభివృద్ధి సాధ్యం కాదు కదా?