ఐపీఎస్ సర్వీస్ చేయమని పంపిస్తే వైపీఎస్ సర్వీస్ చేసి చట్ట ఉల్లఘనలకు పాల్పడిన అనేక మంది ఐపీఎస్ అధికారులకు మెల్లగా పోస్టింగులు దక్కుతున్నాయి. ఘోరాలు చేసిన వారిని మినహాయించి మిగిలిన వారు చేసిన తప్పులను క్షమించి వారికి పోస్టింగులను ప్రభుత్వం ఇస్తోంది. తాజాగా జరిగిన బదిలీల్లో పలువురు పోస్టింగులులేని వారికి అప్రాధాన్య పోస్టులు అయినా ఇచ్చారు.
పోస్టింగులు లేకపోయినా ఇటీవల కొంత మందికి వారి భవిష్యత్ దృష్ట్యా డీఐజీలుగా ప్రమోషన్ ఇచ్చారు. వారికి తాజాగా పోస్టింగులు ఇచ్చారు. టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపణలు ఎదుర్కొన్న హర్షవర్ధన్ రెడ్డికి కూడా పోస్టింగ్ ఇచ్చారు. సీఐడీ ఎన్సీఆర్బీ ఎస్పీగా అవకాశం కల్పించారు.సత్య యేసుబాబుకు పీటీవోలో డీఐజీగా నియమించారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న మరో ఐపీఎస్ అధికారి అన్బురాజన్ ను డీఐజీగా స్పోర్ట్స్ , వేల్ఫేర్ విభాగంలో నియమించారు. పోస్టింగ్ లేని డీఐజీ అట్టాడ బాబూజీ గ్రే హౌండ్ డీఐజీగా, ఫక్కీరప్పను ఎపీఎస్పీ డీఐజీగా బదిలీ చేశారు.
టీడీపీ నేతలపై పలు కేసులు పెట్టడంలో పాల్ రాజు చాలా కీలకం. డీజీపీకి బదులుగా సజ్జల ఆయనను ముందు పెట్టి కథ నడిపించేవారని చెబుతారు. ఆయన కు ఫోరెన్సిక్ ల్యాబ్ డైరక్టర్ పోస్టు ఇచ్చారు. తొక్కిసలాట ఘటన కారణంగా బదిలీ అయిన సుబ్బారాయుడికి ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీ బాధ్యతలిచ్చారు. వైపీఎస్లలో మొదటి రకం బ్యాచ్ కు ఇంకా పోస్టింగులు దక్కలేదు. కాంతిరాణా టాటా, సునీల్ కుమార్, ఆంజనేయులు వంటి వారు కొంత మంది ఉన్నారు. వారికి పోస్టింగులు దక్కే అవకాశాలు కనిపించడం లేదు.