హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుమారుడు లోకేష్‌ను వారసుడుగా తయారుచేసే క్రమంలో ఇవాళ మరో అడుగు ముందుకేశారు. ఇవాళ ప్రకటించిన కేంద్ర కమిటీ, రెండు రాష్ట్ర కమిటీలలో లోకేష్‌కు కీలక బాధ్యతలు కట్టబెట్టారు. చంద్రబాబు ఇవాళ విజయవాడలో మీడియా సమావేశంలో ఈ కమిటీలను ప్రకటించారు. మొత్తం 17మంది సభ్యులతో పాలిట్బ్యూరోను ఏర్పాటు చేశారు. దీనిలో లోకేష్, సుజనా చౌదరి, కళా వెంకట్రావు, ఎల్.రమణలను ఎక్స్అఫిషియో సభ్యులుగా నియమించారు. ఇదికాక కేంద్రకమిటీలో ప్రధాన కార్యదర్శిగాకూడా లోకేష్‌కు బాధ్యతలు అప్పగించారు. లోకేష్ ఇప్పటికే పార్టీలో అనధికారికంగా కీలకపాత్ర పోషిస్తున్నప్పటికీ, ఇవాళ్టి నియామకంతో దానికి రాజముద్ర పడినట్లయింది. మొత్తానికి యువరాజుగా లోకేష్ పట్టాభిషేకం పూర్తయినట్లే.
మరోవైపు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా కళా వెంకట్రావును, తెలంగాణ అధ్యక్షుడిగా ఎల్.రమణను నియమించారు. రెండు రాష్ట్రాలలోనూ అధ్యక్షులు బీసీలు కావటం గమనార్హం. రేవంత్‌ను తెలంగాణకు అధ్యక్షుడిగా నియమిస్తారని వార్తలొచ్చినప్పటికీ ఆయనను వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా మాత్రమే నియమించారు. మరోవైపు ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న పురపాలకశాఖమంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణకు పార్టీలో ఏ పదవీ కట్టబెట్టకపోవటం గమనార్హం. ఆ మాటకొస్తే పార్టీలోకి ఇటీవల వచ్చినవారెవరికీ కూడా పార్టీలో పదవులు ఇవ్వలేదు. ఎమ్ఎల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డిమాత్రం దీనికి మినహాయింపుగా కనబడుతోంది. ప్రకాశంజిల్లాలో రెడ్డి సామాజికవర్గాన్ని ఆకర్షించటంకోసం మాగుంట శ్రీనివాసలరెడ్డికి పార్టీ కేంద్రకమిటీలో ఉపాధ్యక్షుడిగా కీలకపదవి ఇచ్చినట్లు కనబడుతోంది. అయితే పార్టీలోకి ఇటీవల వచ్చిన డొక్కా మాణిక్యవరప్రసాద్, జూపూడి ప్రభాకర్‌లను మాత్రం మీడియా ప్రతినిధుల పదవులలో నియమించారు. నందమూరి వారసుడు హరికృష్ణకు యధావిధిగా పాలిట్‌బ్యూరోలో స్థానం కల్పించారు. అయితే మరో వారసుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణకుమాత్రం ఏ పదవీ ఇవ్వలేదు.
ఇదిలా ఉంటే, ఇవాళ ప్రకటించిన కమిటీపై పార్టీ తెలంగాణ నాయకుడు, ఎమ్మెల్యే సాయన్న అసంతృప్తి వ్యక్తంచేశారు. 30 ఏళ్ళుగా పార్టీకి సేవలందిస్తున్న తనకు పాలిట్‌బ్యూరోలో స్థానం కల్పించకుండా జూనియర్లతోబాటుగా ఉపాధ్యక్షపదవిని కట్టబెట్టారంటూ తన అసంతృప్తిని మీడియాముందు వెళ్ళగక్కారు.