తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యసభ సభ్యుడు.. డి.శ్రీనివాస్ అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. కండువా కప్పించుకోలేదు. కానీ.. ఇప్పుడు నేరుగా.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించబోతున్నారు. మహాకూటమిలోని పార్టీలన్నింటినీ సమన్వయం చేసే బాధ్యతను… డీఎస్‌కు.. సోనియా గాంధీ అప్పగించారు. శుక్రవారం.. ఆయన ఢిల్లీలో సోనియాగాంధీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఎస్… తెలంగాణ తాజా రాజకీయ పరిస్థితులను వివరించినట్లు సమాచారం. భేటీ తర్వాత మహాకూటమిలోని పార్టీలను సమన్వయం చేయాలని సోనియా సూచించినట్లు డీఎస్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు డీఎస్ పీసీసీ చీఫ్ గా ఉండేవారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత.. తనకు ఎమ్మెల్సీ పదవి కొనసాగింపునివ్వలేదన్న కారణంగా.. ఆయన టీఆర్ఎస్లో చేరిపోయారు. అక్కడ కేసీఆర్ ఆయనకు రాజ్యసభ పదవి ఇచ్చిన పక్కన పెట్టేశారు. ఇటీవలి కాలంలో నిజామాబాద్ జిల్లా వ్యవహారాల్లో ఆయనను పట్టించుకోవడం మానేశారు. దాంతో అసంతృప్తికి గురయ్యారు. అనుచరులతో సమావేశం అయ్యారు. దాంతో… డీఎస్‌పై టీఆర్ఎస్ నేతలంతా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. డీఎస్పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఎంపీ కవిత సహా నిజామాబాద్‌జిల్లాకు చెందిన తెరాస ఎమ్మెల్యేలంతా గతంలో సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. కానీ కేసీఆర్ ఏ చర్యా తీసుకోలేదు. డీఎస్ కలుస్తానన్నా అపాయింట్మెంట్ ఇవ్వలేదు.
అప్పటి నుంచి టీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కొద్ది రోజుల కిందట.. రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. పార్టీలో చేరారనే అందరూ అనుకున్నారు. అయితే.. బయటకు వచ్చి పార్టీలో చేరలేదని చెప్పారు. రాహుల్‌తో సమవేశం కోసమే కలిశానన్నారు. నిజానికి అప్పుడే ఆయన పార్టీలో చేరారని.. కానీ.. కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు అధికారికంగా ప్రకటిస్తే.. టీఆర్ఎస్ తనపై అనర్హతా వేటు వేయమని.. రాజ్యసభ చైర్మన్‌కు ఫిర్యాదు చేస్తారని.. అదే జరిగితే పది ఊడిపోతుందన్న ఉద్దేశంతోనే.. కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు అధికారిక ప్రకటన లేదన్న భావన ఉంది. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు… కాంగ్రెస్ తరపున.. ప్రత్యక్షంగా బాధ్యతలు నిర్వహించబోతున్నారు కానీ.. ఆయన కాంగ్రెస్ సభ్యుడు కాదన్నట్లుగా రాజకీయం నడుస్తుంది.