‘ఖైదీ’ హిట్టుతో కార్తి మళ్లీ ఊపిరి పీల్చుకుంటున్నాడు. ఓ సినిమాకి మంచి వసూళ్లు దక్కడం ఓ వంతు. గొప్ప సినిమా తీశావ్.. అనే పేరు తెచ్చుకోవడం మరో వంతు. ఈ రెండు ఆనందాల్నీ ఇప్పుడు కార్తీ ఉమ్మడిగా అనుభవిస్తున్నాడు. ఖైదీ ఎప్పుడైతే హిట్టయ్యిందో అప్పుడే ‘ఖైదీ 2’ ఆశలు మొలకెత్తాయి. దానికీ ఓ బలమైన కారణం ఉంది. ఈ సినిమాకి కొనసాగింపు కూడా ఉంది అన్న హింటు ఇస్తూ.. ‘ఖైదీ’ ముగించాడు దర్శకుడు కనకరాజ్. అప్పుడే `ఖైదీ 2`పై ఆశలు రేకెత్తాయి. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ఉందన్న విషయాన్ని కార్తీ కూడా ధృవీకరించాడు.
ఖైదీకి సీక్వెల్ ఉంటుందని, తప్పకుండా త్వరలోనే ఆ సినిమా మొదలవుతుంది కార్తీ చెప్పాడు. ఈ సినిమాని 30 రోజుల్లో ముగిస్తార్ట. ”నిర్మాత ఖైదీ 2 కోసం 30 రోజుల కాల్షీట్లు అడిగారు. రాత్రి అయితే కష్టం..ఈసారి పగలు తీయండి అన్నాను” అంటూ కార్తీ చమత్కరించాడు. ‘ఖైదీ’ ఓ రాత్రి జరిగిన కథ. ‘ఖైదీ 2’ మాత్రం అలా కాదు. ఢిల్లీ ఎందుకు జైలుకు వెళ్లాడు? జైలులో ఏం జరిగింది? అనే విషయాన్ని పార్ట్ 2లో చూపిస్తారు. ఓ రకంగా ఇది సీక్వెల్ కాదు. ప్రీక్వెల్ అనుకోవాలి.