చిరంజీవి అభిమానులకు వారం ముందే సంక్రాంతి పండగ వచ్చేసింది. చిరు తన ఖైదీ నంబర్ 150 ట్రైలర్‌ని పండగ గిఫ్ట్‌గా ముందే ఇచ్చేశాడు. గుంటూరులోని హాయ్లాండ్లో జరిగిన ఖైదీ నెం150 ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ట్రయిలర్ ఆవిష్కరించారు. ‘బాస్ ఈజ్ బ్యాక్’ అనే ట్యాగ్‌లైన్ కి న్యాయం చేస్తూ..ఈ ట్రైలర్లో అంతా చిరు హంగామానే కనిపిస్తోంది. డాన్సులు, తనదైన మేనరిజం, మాస్ డైలాగులు, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకొన్నాడు చిరంజీవి. సినిమా సంగతేమో గానీ… ట్రైలర్ మాత్రం చిరు వన్ మ్యాన్ షోలానే మారిపోయింది. ‘పొగరు నా ఒంట్లో ఉంది.. హీరోయిజం నా ఇంట్లో ఉంది’ అంటూ మెగా అభిమానుల కోసం ఓ డైలాగ్ వదిలాడు చిరు.
ఎంపైర్ ఆఫ్ ఎంటర్టైనర్ అనే ట్యాగ్ లైన్ కి సార్థకత చేకూరేలా.. చిరు ఈ సినిమాతో నూటికి నూరు శాతం వినోదం అందించడం గ్యారెంటీ అనిపిస్తోంది. కత్తి సినిమా చూసినవాళ్లకు ఈ ట్రైలర్.. ‘కాపీ పేస్ట్’ అన్నట్టే అనిపించొచ్చు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చూసీ చూసీ విగిసిపోయినవాళ్లకు ఖైదీ కూడా ఆ తానులో ముక్కే అనిపించొచ్చు. కానీ చిరు ఎలాంటి సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు ఆశించారో… కచ్చితంగా వినాయక్ అలాంటి సినిమానే తీశాడనిపిస్తోంది. నిర్మాణ విలువలు హై రేంజ్లో ఉన్నాయి. కొన్ని కీలక సన్నివేశాల్ని కత్తిలో ఉన్నట్టుగానే యాజ్ ఇట్ ఈజ్ దించేసినట్టు కనిపిస్తున్నా… సినిమా మాత్రం చిరు అభిమానుల్ని మెప్పించేలా ఉండబోతోందన్నది అర్థమవుతోంది. సో.. మెగా అభిమానులు పండగ చేసుకోవడానికి రెడీ అయిపోవొచ్చు.