విభిన్నమైన కథలు ఎంచుకోవడంలో కార్తి ఎప్పుడూ ముందుంటాడు. తనకు విజయాల్ని కట్టిపెట్టింది కూడా ఈ దృక్పథమే. కాకపోతే ఈమధ్య తనకు టైమ్ అస్సలు కలసిరాడం లేదు. ఏ కథ పట్టుకున్నా – హిట్టు కనికరించడం లేదు. `ఖాకీ` తరవాత.. కార్తికి సరైన సినిమా పడలేదు. వచ్చిందల్లా డిజాస్టరే. అయితే ఇప్పుడు `ఖైదీ` అవతారం ఎత్తాడు. దిల్లీ అనే యావజ్జీవ ఖైదీ – జైలు నుంచి పారిపోవడానికి చేసిన ప్రయత్నం, ఆ తరవాత జరిగిన పరిణామాలూ, ఆ ప్రయాణంలో 900 కోట్ల విలువ గల సరుకును స్మగ్లింగ్ చేస్తున్న ముఠాతో తలపడడం – మధ్యలో కూతురితో ఎమోషన్ – వీటి చుట్టూ నడిపించిన కథ ఇది. పాటల్లేవు. రొమాన్సూ లేదు. ట్రైలర్ కట్ చేసిన వ్యవహారం చూస్తుంటే ఒక రోజు రాత్రి జరిగిన కథేమో అనిపిస్తుంది. ఖాకీలో రియలిస్టిక్ అప్రోచ్ చాలా బాగా ఆకట్టుకుంది. సరిగ్గా.. ఖైదీలోనూ అలానే కనిపిస్తోంది. యాక్షన్, కెమెరా పనితనం, నటీనటులు, లొకేషన్లు… ఇవన్నీ.. అత్యంత సహజంగా అనిపిస్తున్నాయి. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాకి, కాస్త సెంటిమెంట్ జోడించి తీసిన సినిమా ఇది. కార్తి ఈ సారి ఒళ్లు దగ్గర పెట్టుకుని కథ ఎంచుకున్నాడనిపిస్తోంది. ఈ దీపావళికి ఈ సినిమా విడుదల కానుంది. మరి పాటలూ, రొమాన్సూ ఏవీ లేకుండా చేసిన ఈ ప్రయత్నం… ఎంత వరకూ సఫలీకృతం అవుతుందో చూడాలి.