చిరు ఫ్యాన్స్‌కి మరో షాక్! ఈనెల 4న జరగాల్సిన ఖైదీ నెం.150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ వాయిదా పడింది. ఈనెల 7న ఈ వేడుకని నిర్వహించబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. అయితే వేదిక ఇంకా ఫిక్స్ కాలేదు. చిరంజీవి – వినాయక్‌ల కాంబినేషన్లో రూపుదిద్దుకొన్న చిత్రం ఖైదీ నెం. 150. ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ని క్రిస్మస్ సందర్భంగా నిర్వహించాలని చిత్రబృందం భావించింది. అయితే ఆ నిర్ణయం మార్చుకొన్నారు. ఏకంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్నే గ్రాండ్‌గా చేయాలని డిసైడ్ అయ్యారు. 4వ తారీఖున విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించడానికి కూడా అనుమతులు తీసుకొన్నారు. ఇప్పుడు అక్కడే కథ అడ్డం తిరిగింది. `ఈ స్టేడియంలో ఫ్యామిలీ ఫంక్షన్స్, సినిమా ఫంక్షన్స్ చేసుకోవడానికి అనుమతులు లేవు` అంటూ విజయవాడ మున్సిపల్ అధికారులు మోకాలడ్డారట. అయితే ఇక్కడ పర్మిషన్ మంజూరు చేసింది కూడా వాళ్లే. ఇప్పటికిప్పుడు ఎందుకు ప్లేట్ మార్చారు అనేది ఆసక్తిని కలిగిస్తోంది. దీని వెనుక రాజకీయ హస్తం ఏమైనా ఉందా? లేదంటే నిజంగానే అక్కడ అనుమతులు దొరకవా? అనే చర్చ మొదలైంది.
ఈ విషయంపై ఖైదీ నెం.150 పీఆర్వో సురేష్ కొండేటి తెలుగు 360తో మాట్లాడారు. ”ఇది వరకు ఓ సినిమా ఫంక్షన్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించాలని అనుకొన్నారు. అప్పుడు కోర్టులో పిటీషన్ వేసి స్టే ఆర్డర్ తెచ్చుకొన్నారు. ఆనాడే ఈ స్టేడియంలో సినిమా, ప్రైవేటు ఫంక్షన్లు నిర్వహించుకోకూడదని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. దాన్ని గమనించకుండా ప్రస్తుతం ఉన్న అధికారులు అనుమతులు మంజూరు చేశారు. ఇప్పుడు పాత ఆర్డర్లు ఓసారి చెక్ చేసుకోవడం మూలాన… ఖైదీ నెం.150కి ఇచ్చిన అనుమతులు వెనక్కి తీసుకొన్నారు” అంటూ క్లారిటీ ఇచ్చేశారు.