ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన ఘట్టం పూర్తి అయింది. ఎన్టీఆర్ మార్గ్ లోని నాలుగో నెంబర్ క్రేన్ వద్ద గణనాథుడిని నిమజ్జనం చేశారు. 70 అడుగుల సప్తముఖ మహాశక్తి గణపతి నిమజ్జనోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు ట్యాంక్ బండ్ వద్దకు తరలివచ్చారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
మంగళవారం ఉదయం ప్రారంభమైన మహాగణపతి శోభా యాత్ర గంటలపాటు కన్నుల పండగగా సాగింది. ఈ యాత్రలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ శోభాయాత్ర మార్గంలో ముందే ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు భారీ బందోబస్తు నడుమ మహాగణపతి శోభాయాత్రను ఎలాంటి ఆటంకాలు లేకుండా ముగించారు.
మరోవైపు..గ్రేటర్ పరిధిలోని పలు విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు వేలాది విగ్రహాలు ట్యాంక్ బండ్ వైపు వైపు కదులుతున్నాయి. అదే సమయంలో ట్యాంక్ బండ్ పై జరిగే నిమజ్జనోత్సవాలను తిలకించేందుకు జనం అటువైపు వైపు భారీగా తరలి వెళ్తున్నారు. దీంతో ఆ మార్గం జనసంద్రోహంతో కిక్కిరిసిపోయి కనిపిస్తోంది.
ఇక, తెలంగాణ వ్యాప్తంగా అర్దరాత్రి లోపు నిమజ్జనం కార్యక్రమం ముగిసేలా చర్యలు చేపడుతున్నట్లు డీజీపీ వివరించారు. బైంసాతోపాటు మరికొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో నిమజ్జనం ప్రశాంతంగా ముగిసిందని వెల్లడించారు. గణనాథుడి నిమజ్జనాలపై సీపీ, డీసీపీ లెవల్ లో మీటింగ్ నిర్వహించామన్నారు. లక్ష విగ్రహాలు నిమజ్జనం కానున్నట్లు తెలిపారు.