ఏటికేడు.. అత్యంత ఎత్తైన విగ్రహంతో ఆశ్చర్యపరిచే ఖైరతాబాద్ గణేశుడు ఈ సారి ఒక్కటంటే.. ఒక్క అడుగుకే పరిమితం కానున్నారు. భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది వినాయక చవితి ఆగస్టు 22 వ తేదీన వచ్చింది. సాధారణంగా… ఖైతరాబాద్ గణేష్ విగ్రహా నిర్మాణ పనులను రెండు నెలల ముందుగా ప్రారంభిస్తారు. అంతకంటే ముందుగానే…విగ్రహం ఏ రూపంలో ఉండాలి.. ఎంత ఎత్తులోఉండాలనేది నిర్ణయించుకుంటారు. ఇప్పుడు సమయం దగ్గర పడటంతో..గణేష్ ఉత్సవ సమితి…విగ్రహ ఏర్పాట్లపై సమావేశం జరిపింది.
కరోనా కారణంగా…ఈ ఏడాది వినాయక ఉత్సవాలు ఎప్పట్లా నిర్వహించడం సాధ్యం కాదన్న అభిప్రాయానికి వచ్చారు. అతి పెద్ద విగ్రహం పెట్టడం కానీ…అక్కడికి పెద్ద ఎత్తున భక్తుల్ని అనుమతించడం కుదరపనిగా తీర్మానించారు. అందుకే.. ఈ సారికి ఒక్కటంటే.. ఒక్కఅడుగు విగ్రహానికి సరిపుచ్చి…సాదాసీదాగా పూజలు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.కరోనా వైరస్ ఇప్పటికీ అదుపులోకి రాలేదు. ఇప్పుడల్లా అదుపులోకి రాదని.. అందరూ దానితో కలిసి జీవించేందుకు సిద్ధపడాలన్న అభిప్రాయాన్ని వినిపిస్తున్నారు.
అంటే…భౌతికదూరం పాటించడం.. జనం గుమికూడే ప్రాంతాలకు వెళ్లకపోవడం.. మాస్కులు తప్పని సరిచేసుకోవడం వంటివి జీవితంలో భాగం కానున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గణేష్ ఉత్సవాలను నిర్వహించడం సాధ్యం కాదని భావిస్తున్నారు. దశాబ్దాలుగా…ఖైరతాబాద్ వినాయుకని విగ్రహం ఎత్తు పెరుగుతూనే ఉంది. ఈ సారి ప్రపంచాన్నే మార్చేసిన కరోనా దెబ్బకు ఖైరతాబాద్ గణేశుడు కూడా మారిపోయాడు.