ఖమ్మం జిల్లాలో అయిదు నియోజకవర్గాలలో ఎన్నికల రాజకీయం కాకపుట్టిస్తోంది. ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాలలో అభ్యర్దులు హోరా హోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అతిరధ మహారధులు రంగంలోకి దిగి తమ అభ్యర్ధులను, అనుచరులను గెలిపించుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. టిఆర్ఎస్ గెలుపు భాద్యతలను భుజాలకెత్తుకున్న తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ గెలుపే లక్ష్యంగా ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు.
ఖమ్మం నియోజకవర్గం ఒకప్పుడు కమ్యునిస్టుల ఖిల్లా. ప్రస్తుతం పరిస్దితులు పూర్తిగా మారిపోయాయి. ఖమ్మంలో ఒకప్పుడు కాలు మోపేందుకు కూడా చోటు దొరకని చోట టీఆర్ఎస్ ప్రధాన పోటీదారు గా మారింది. 2014 ఎన్నికలలో ఖమ్మం నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీ చేసిన పువ్వాడ అజయ్ కుమార్ విజయం సాధించారు. ఆ తరువాత టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఈ సారి అజయ్ కుమార్ టిఆర్ఎస్ నుంచి ఖమ్మం అభ్యర్దిగా ఎన్నికల బరిలో నిలిచారు. మహాకూటమి అత్యంత వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ కి కేటాయించారు. ఆర్దిక , అంగబలాల విషయంలో అజయ్‌తో పోటీ పడే నామా నాగేశ్వరరావు ను అభ్యర్థిగా బరిలోకి దించారు. ఇద్దరు నేతలు ఎత్తులు పై ఎత్తుల తో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఎవరికి వారు… అన్ని వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికార వ్యతిరేకత అజయ్‌కు ఇబ్బందికరంగా మారింది. కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలసి రావడం నామాకు ప్లస్‌గా మారింది. పాలేరులో టిఆర్ఎస్, కాంగ్రెస్ వార్ కొనసాగుతోంది. పాలేరు నుంచి టిఆర్ఎస్ అభ్యర్దిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బరిలో నిలిచారు. గతంలో పాలేరు శాసన సభ్యుడిగా గెలుపొందిన రాంరెడ్డి వెంకట రెడ్డి మరణించటంతో పాలేరు కు జరిగిన ఉప ఎన్నికలలో పాలేరు నుంచి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు గెలుపొందారు. పాలేరులో గెలచితీరాలన్న సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ పాలేరు నుంచి తమ అభ్యర్ధిగా కందాల ఉపేందర్ రెడ్డిని ఎన్నికల బరిలో దించింది. మహా కూటమి మద్దతు తోపాటు పాలేరులో సాంప్రదాయంగా ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంకు తన విజయానికి దోహదపడుతుందని ఉపేందర్ రెడ్డి ధీమాగా ఉన్నారు.
మధిర ఎస్సీ నియోజకవర్గంలో ఈ సారి త్రిముఖ పోటీ కొనసాగుతోంది. మధిర లో టిఆర్ఎస్ నుంచి లింగాల కమల్ రాజ్, కాంగ్రెస్ నుంచి మల్లు భట్టి విక్రమార్క, బిఎల్ ఎఫ్ నుంచి కోట రాంబాబు ఎన్నికల బరిలో నిలిచారు. మధిరలో ఇప్పటికే రెండు సార్లు గెలుపొందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ మల్లు భట్టి విక్రమార్క మూడు సారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టిఆర్ఎస్ నుంచి బరి దిగిన లింగాల కమల్ రాజ్ గతంలో జరిగిన రెండు ఎన్నికలలో మధిరలో పోటీ చేసి భట్టి విక్రమార్క పై ఓడిపోయారు. గతంలో సిపిఎం నుంచి పోటీ చేసిన లింగాల కమల్ రాజ్ ఈ సారి టిఆర్ఎస్ తీర్దం పుచ్చుకుని టిఆర్ఎస్ అభ్యర్దిగా రంగంలోకి దిగారు. టిఆర్ఎస్ లో చేరి సీటు ఆశించిన కోట రాంబాబు ఆతరువాత టిఆర్ఎస్ లో సీటు రాకపోవటంతో సిపిఎం లో చేరి బిఎల్ ఎఫ్ అభ్యర్దిగా మధిర నుంచి పోటీకి దిగారు.
వైరా ఎస్టీ నియోజకవర్గంలో 2014 ఎన్నికలలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందిన బాణోతు మదన్ లాల్ ఈ సారి టిఆర్ఎస్ అభ్యర్దిగా బరిలో నిలిచారు. మహాకూటమి నుంచి వైరా సీటును సిపిఐ ఆశించిగా కూటమి వైరా సీటు ను సిపిఐ కి కేటాయిచటం తో సిపిఐ నుంచి బాణోతు విజయ పోటీ చేస్తున్నారు.. వైరాలో బిజేపి నుంచి సినీ నటి రేష్మబాయి, సిపిఎం నుంచి భ్యూక్యా వీరభద్రం పోటీ చేస్తున్నారు. టిఆర్ఎస్ లో ఉన్న అంతర్గత విబేదాలు తమకు కలసి వస్తాయని సిపిఐ భావిస్తోంది.
సత్తుపల్లి రాజకీయం కూడా రసవత్తరంగా సాగుతోంది. సత్తుపల్లిలో ఇప్పటికే రెండు సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్దిగా పోటీ చేసి గెలుపొందిన సండ్ర వెంకట వీరయ్య మూడో సారి ఎన్నికల బరిలో నిలిచారు. సత్తుపల్లి నుంచి హ్యాట్రిక్ సాధిస్తానని వెంకట వీరయ్య ధీమాగా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ చేపట్టిన ”ఆపరేషన్ ఖమ్మం” లో సత్తుపల్లి కూడా ఉంది. సత్తుపల్లిలో టిడిపి అభ్యర్ది సండ్ర వెంకట వీరయ్యను ఓడించేందుకు టిఆర్ఎస్ వ్యూహాత్యకంగా అడుగులు వేస్తోంది. సత్తుపల్లిలో పిడమర్తి రవిని గెలపించేందుకు టిఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించిన నియోజకవర్గాలలో సత్తుపల్లి కూడా ఒకటి. ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిసిసిబి ఛైర్మన్ మువ్వా విజయ్ బాబు, ఇటీవల టిఆర్ఎస్ లో చేరిన మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారులు మాజీ మంత్రి జలగం ప్రసాదరావు, ఆయన సోదరుడు కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు పిడమర్తి రవి గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఇంత మంది నేతలంతా ఒక వైపు సండ్ర వెంకట వీరయ్య ఒక్కడే ఒక పైపు నిలబడి పోరాటం చేస్తున్నారు. ప్రజల సానుభూతి ఆయన వైపే ఉంది.