ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ తుడిచి పెట్టుకుపోయే సూచనలు కనిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టిక్కెట్లు నిరాకరించడంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరిపోయారు. వారితో పాటే క్యాడర్ వెళ్లిపోయింది. వారు పార్టీలోకి రాక ముందు ఒక్క సీటే ఉంది.. వారు వచ్చినా ఒక్క సీటే అని కేసీఆర్ సెటైర్లు వేశారు. వారి అవసరం లేదనుకున్నారు. దానికి తగ్గట్లుగా ఎన్నికల్లో ఒక్క సీటే వచ్చింది. ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్ తో పాలునీళ్లలా కలసిపోతున్నారు.
అయితే సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్న కేసీఆర్ కు.. వారు వెళ్లిపోవడం వల్ల జరిగిన డ్యామేజ్ ఎంటో ఎన్నికల ఫలితాల్లో తేలింది. ప్రతీ చోటా యాభై వేలకుపైగా ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోరాడింది పువ్వాడ అజయ్. ఎంపీ నామా. వారు లేకపోతే ఇక బీఆర్ఎస్ కు జిల్లాలో ఎవరూ లేనట్లే. ఇప్పుడు వారు కూడా బీజేపీలో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
కాంగ్రెస్ ను తట్టుకోవాలంటే బీఆర్ఎస్ వల్ల కాదని..తాము బీజేపీలో చేరిపోతే మంచిదని అనుకుంటున్నారు. ఎంపీ నామా ముందు కాంగ్రెస్ ను సంప్రదించారు. వారు టిక్కెట్ చాన్స్ లేదని చెప్పడంతో బీజేపీ వైపు చూస్తున్నారని అంటున్నారు. ఖమ్మంలో బీజేపీ బలోపేతం కోసం వీరిని చేర్చుకోవాలని బీజేపీ అగ్రనేతలు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇదే జరిగితే ఖమ్మం బీఆర్ఎస్ ఉనికి కోల్పోతుంది.