ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నుండి ఒక్కరినీ కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వను అంటూ సవాల్ విసిరి మరీ పంతం నెగ్గించుకున్న నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పొంగులేటి చేరిక తర్వాత కాంగ్రెస్ లో కనిపించిన జోష్ అంతా ఇంతా కాదు. అన్ని రకాలుగా బలమైన నేత కావటం కాంగ్రెస్ కు కలిసిరాగా, ఎంపీ ఎన్నికల్లో పెద్ద తలనొప్పే తెచ్చిపెట్టింది.
కాంగ్రెస్ గెలుపు కన్ఫామ్ అనుకున్న సీట్లలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న సీటు ఖమ్మం. ప్రత్యర్థి పార్టీలకు కూడా ఖమ్మం గెలవలేం అన్నట్లుగా ఫిక్స్ అయిపోయిన తరుణంలో గెలిచే సీటు ఎవరికి అన్న పోటీ నెలకొంది. వీహెచ్ మొదలు చాలా మంది నేతలు ఖమ్మం సీటు కోసం ప్రయత్నించారు. ఈ లిస్టులో డిప్యూటీ సీఎం భట్టి భార్య, మంత్రి పొంగులేటి సోదరుడు, మంత్రి తుమ్మల కొడుకు ఉండటంతో హాట్ టాపిక్ గా మారింది. అధినాయకత్వం కూడా ఆ సీటుపై ఏటూ తేల్చలేదు.
అయితే, ఏఐసీసీ వర్గాల సమాచారం ప్రకారం… ఖమ్మం సీటుపై మంత్రి పొంగులేటి తన పంతం నెగ్గించుకున్నట్లు తెలుస్తోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డికి టికెట్ కన్ఫామ్ అయినట్లు సమాచారం. ఇక మరో పెండింగ్ సీటు కరీంనగర్ నుండి అందరూ ఊహించినట్లుగానే వెలిచాల రాజేందర్ రావుకు కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ రెండు సెగ్మెంట్లతో పాటు హైదరాబాద్ సీటు కూడా పెండింగ్ లో ఉన్నాయి.
ఒకట్రెండు రోజుల్లో ఈ మూడు సీట్లకు అభ్యర్థులను ఏఐసీసీ అధికారికంగా ప్రకటించనుంది.