ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిన్నటి వరకూ బీఆర్ఎస్ లో వర్గ పోరాటం ఉండేది. కీలక నేతలందరూ ఉన్నా విజయాలు దక్కలేదు. ఇప్పుడా పరిస్థితి కాంగ్రెస్ కు వస్తోంది. వరుసగా ఆ పార్టీలో కీలక నేతలంతా చేరుతున్నారు. ఉమ్మడి ఖమ్మంలో పది స్థానాలు ఉన్నప్పటికీ జనరల్ స్థానాలు మాత్రం కేవలం మూడు మాత్రమే. పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం మాత్రమే జనరల్ స్థానాలు. కీలక నేతలంతా ఈ మూడు స్థానాల కోసమే పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తాజాగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రేపోమాపో చేరుతారని భావిస్తున్న జలగం వెంకట్రావు, అలాగే పార్టీని విలీనం చేయాలనుకుంటున్న షర్మిల… ఇలా అందరూ ఉమ్మడి జిల్లాలో ఉన్న మూడు అన్ రిజర్వుడు అసెంబ్లీ స్థానాల కోసం పోటీ పడుతున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెడ్డి సీటుగా పేరు పొందిన పాలేరులో షర్మిల, తుమ్మల నాగేశ్వరరావు పోటీకి రెడీ అయ్యారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి సైతం పాలేరు సీటుకే దరఖాస్తు చేసుకున్నారు. కొత్తగూడెం నుంచి పోటీ చేసేందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే సర్వం సిద్ధం చేసుకున్నారు. ఇంటిని నిర్మించుకొని గృహప్రవేశమూ చేశారు. కానీ జలగం వెంకట్రావు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో మళ్లి సందిగ్ధత ఏర్పడుతోంది.
పార్టీలో చేరుతున్న వారంతా కీలక నేతలే. వారి అనుచరులు కూడా పార్టీలోకి వస్తారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో మళ్లీ వర్గ పోరాటం ప్రారంభం అవుతుంది. ఇది కాంగ్రెస్ కు మేలు చేస్తుందా కీడు చేస్తుందో అంచనా వేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. అందరూ కలిస్తే మాత్రం కాంగ్రెస్ కు భారీ విజయాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.