ఖమ్మం జిల్లా పాలేరు ఉపఎన్నికలలో అ నియోజక వర్గంపై గట్టి పట్టున్న మంత్రి తుమ్మల నాగేశ్వర రావుని తెరాస అభ్యర్ధిగా నిలబెట్టడంతో తెరాస విజయం ఖాయం అనే భావన అందరిలో ఏర్పడింది. చిన్న పామునయినా పెద్ద కర్రతోనే కొట్టే అలవాటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఉపఎన్నికలలో తెరాస ఘన విజయం సాధించడం కోసం తన కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావుతో సహా చాలా మంది మంత్రులను, సీనియర్ తెరాస నేతలను పాలేరులో మొహరించారు. కనుక తెరాస ఎంత మెజార్టీతో గెలుస్తుందనే అందరూ ఆలోచిస్తున్నారు తప్ప గెలుస్తుందా..ఓడిపోతుందా అని ఎవరూ ఆలోచించడం లేదు.
అయితే రామిరెడ్డి వెంకట రెడ్డి మృతి కారణంగా జరుగుతున్న ఈ ఉపఎన్నికలలో ‘సానుభూతి ఓటు’తో విజయం సాధించే అవకాశం ఉందని గట్టిగా నమ్మిన టీ-కాంగ్రెస్ పార్టీ ఆయన భార్య సుచరితా రెడ్డిని తన అభ్యర్ధిగా బరిలో నిలబెట్టి, పాలేరులో చాలా ఉదృతంగా ప్రచారం మొదలుపెట్టింది. ఈ ఉపఎన్నికల బరిలో నుంచి తెదేపా, భాజపా, వైకాపాలు మూడు తప్పుకోవడంతో తమకు ఎదురే ఉండదని, అవలీలగా గెలుస్తామనుకొన్న తెరాస కాంగ్రెస్ స్పీడు చూసి తెరాస కూడా చేమటోడ్చక తప్పడం లేదు.
నేలకొండపల్లిలో నిన్న ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీనియర్ కాంగ్రెస్ నేత కె. జానారెడ్డి తెరాస అభ్యర్ధి తుమ్మల నాగేశ్వర రావుని, తెరాస ప్రభుత్వాన్ని, దాని ముఖ్యమంత్రి కేసీఆర్ పై చాలా సునిశితమయిన విమర్శలు చేసారు. “తెలంగాణా సాధన కోసం ఏనాడు పోరాడని తుమ్మల నాగేశ్వర రావు తెలంగాణా ద్రోహి. అటువంటి వ్యక్తికి కేసీఆర్ మంత్రి పదవి కట్టబెట్టారు. ఈ ఎన్నికలలో తెరాస అభ్యర్ధిగా నిలబెట్టారు. ఆయన జిల్లాలో కాంట్రాక్టర్లను, లిక్కర్ వ్యాపారులను రంగంలోకి దింపి, ఓటర్లకు డబ్బు, మద్యంతో ప్రలోభపెట్టి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారు. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొని ఉంటే, రాష్ట్రాన్ని గాలికొదిలేసి, మంత్రులు అందరూ పాలేరులో తిష్ట వేసి ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీయే ఉండకూడదని ఫిరాయిమ్పులని ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రజలు గట్టిగా బుద్ది చెప్పాలంటే కాంగ్రెస్ అభ్యర్ధి సుచరిత రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలి,” అని కోరారు.
తెలంగాణా ఏర్పడినప్పటి నుంచి సాగున ప్రతీ రెండుమూడు నెలలకీ ఏదో ఒక ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. కనుక రాష్ట్రంలో తెరాసకు, ప్రభుత్వానికి ఎదురు ఉండకూడదనే ఆలోచనతోనే ప్రతీ ఎన్నికలలో తప్పనిసరిగా భారీ మెజార్టీతో గెలవాలని కేసీఆర్ కోరుకోవడం సహజమైపోయింది. అందుకోసం ముందుగా ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడం అందరూ చూస్తనే ఉన్నారు. ప్రజాస్వామ్య పద్ధతులకి వ్యతిరేకంగా సాగుతున్న తెరాసకి ఎప్పుడో అప్పుడు కళ్ళెం వేయడం చాలా అవసరం. అదే మాట పాలేరు ఎన్నికల ప్రచారంలో జానారెడ్డి, కాంగ్రెస్ నేతలు చెపుతున్నారనుకోవాలి. కానీ ఇప్పుడు తెరాసకి తప్ప మరే పార్టీకి ఓటేసినా అది వృధా అయిపోయినట్లేనని తెరాస చేస్తున్న ప్రచారం కూడా ప్రజలను చాలా ఆలోచింపజేస్తోంది. ప్రజలు తమకు నచ్చిన పార్టీ అభ్యర్ధికే ఓటు వేసి గెలిపించుకొన్నా చివరికి అతను లేదా ఆమె మళ్ళీ తెరాసలోనే చేరిపోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక ఆ వేసే ఓట్లేవో తెరాస అభ్యర్ధికే వేస్తే సరిపోతుంది కదా? అని ప్రజలు ఆలోచిస్తే ఆశ్చర్యమేమీ లేదు.