రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఖిలాడీ. రమేష్ వర్మ దర్శకుడు. చిత్రీకరణ పూర్తయింది. విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు ప్రమోషన్ల జోరూ పెంచారు. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా నుంచి తొలి పాటని విడుదల చేశారు. ఓ అమ్మాయి. తన ఇష్టాల గురించి ఇష్టంగా చెప్పుకునే పాట ఇది. శ్రీమణి రచించారు. హరి ప్రియ ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్ ఎప్పుడూ పెప్పీ ట్యూన్స్ నే ఇస్తుంటాడు. ఇప్పుడు కూడా అలానే ఓ క్యాచీ బాణీ వదిలాడు.
”చిన్నప్పుడు నాకు అమ్మ గోరు ముద్దంటే ఇష్టం
కాస్తెదిగాక బామ్మ గోరింటాకు ఇష్టం
బళ్లోకెళ్లే వేళ రెండు జాళ్లంటే
పైటేసినాక ముగ్గు లేయడం ఇష్టం” – అంటూ ఓ అమ్మాయి తన ఇష్టాల గురించి అల్లరిగా పాడుకునే పాట ఇది.
”కొత్త ఆవకాయ ముక్కంటే ఇష్టం
పక్కఇంటి పూల మొక్కంటే ఇష్టం
అంతకంటే నేను అంటే నాకు ఇష్టం
కానీ ఇప్పుడు నాకు ఇప్పుడు ఒకటే ఇష్టం
అది నాకోసం నువ్ పడే కష్టం” – అంటూ హీరో అంటే తనకిష్టమో.. పాటతో చెప్పే సరదా పాట ఇది.
”తెల్లారంగానే వెచ్చనైన కాఫీ ఇష్టం
ఉల్లాసం పెంచే స్వచ్ఛమైన సోపే ఇష్టం” – అంటూ చరణాల్లో వినిపిస్తుంది.
”అద్దం ముందర నాకు అందం అద్దడమంటే ఇష్టం” – లాంటి మంచి పదాలు పడ్డాయి. అమ్మాయిలకు నచ్చే పాట ఇది. `డుగ్గు డుగ్గు బండి` లాంటి పాటలు పూర్తిగా అమ్మాయిల కోసమే కంపోజ్ చేస్తుంటారు. ఆ పాటల్ని అమ్మాయిలు అక్కున చేర్చేసుకుంటారు. ఈ పాట కూడా అలానే… వాళ్లకు వినగానే నచ్చేసేలా ఉంది.