రవితేజ తాజా చిత్రం `ఖిలాడీ`. రమేష్ వర్మ దర్శకుడు. ఇటలీలో ఓ కీలకమైన షెడ్యూల్ ప్లాన్ చేశారు. అయితే… మధ్యలోనే టీమ్ అంతా ఇండియా వచ్చేయాల్సివచ్చింది. దానికి కారణం.. కరోనా భయాలే. ఇటలీలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా సాగుతోంది. ఏ క్షణంలో అయినా లాక్ డౌన్ విధించొచ్చన్న భయాలు ఎక్కువయ్యాయి. దాంతో ఎందుకైనా మంచిదని, షెడ్యూల్ కంటే ముందే.. టీమ్ అంతా ఇటలీ నుంచి తిరుగు ప్రయాణమైంది.
సగం రోజులే షూట్ చేసినా.. ఖర్చు మాత్రం తడిసి మోపెడయ్యిందని టాక్. 3 కోట్లతో ఈ షెడ్యూల్ ముగించాలనుకున్నారు. తీరా చూస్తే… ఖర్చు 5 కోట్లయ్యింది. హోటెల్ రూములు, లొకేషన్ ఛార్జీలు…ఇవన్నీ విపరీతంగా పెరిగిపోవడమే దీనికి కారణం. పైగా… ఎట్టిపరిస్థితుల్లోనూ ఇండియా తిరిగి వచ్చేయాలన్న ఉద్దేశంతో.. ప్రత్యేక ఫ్లైట్ లో టీమ్ అంతా.. ప్రయాణమైందట. దాంతో… ఖర్చు భారీగా పెరిగిందని తెలుస్తోంది. మరోదఫా చిత్రబృందం ఇటలీ వెళ్లాలి. లేదంటే.. మ్యాచింగ్ సీన్లని ఇండియాలోనే పూర్తి చేయాలి. ఈ షెడ్యూల్ లో ఎలాగైనా ఖర్చు అదుపులో ఉంచుకోవాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.