మేలో కొత్త సినిమా బయటకు వచ్చే ఛాన్సే లేదు. ఎందుకంటే.. కరోనా ఆ స్థాయిలో విజృంభిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ లో పాక్షిక కర్ఫ్యూ అమలు అవుతోంది. తెలంగాణలో కూడా త్వరలో ఇలాంటి నిబంధనలే విధించొచ్చు. ఇప్పట్లో జన జీవనం సాధారణమైన పరిస్థితికి వచ్చే అవకాశం లేదు. అందుకే సినిమాలూ వాయిదా పడుతున్నాయి. మేలో రావాల్సిన పలు చిత్రాలు ఇప్పటికే వాయిదా బాట పట్టాయి. ఇప్పుడు ఖిలాడీ వంతు వచ్చింది. రవితేజ ద్విపాత్రాభినయం పోషించిన చిత్రమిది. రమేష్ వర్మ దర్శకుడు. ఈనెల 29న రావాల్సిన సినిమా ఇది. ఇప్పుడు వాయిదా వేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. పరిస్థితులు అనుకూలించాక కొత్త విడుదల తేదీ చెబుతామని క్లారిటీ ఇచ్చాయి. మేలో రావాల్సిన సినిమాలన్నీ జులైలో విడుదలయ్యే ఛాన్స్ వుంది. అప్పటికీ పరిస్థితులు అనుకూలిస్తేనే. కాబట్టి.. ఈ సమ్మర్ సీజన్ ని కరోనా మింగేసినట్టే అనుకోవాలి.