తమిళనాడుకు ఏదో ముఖ్యమంత్రి అయిపోవాలనే కోరికలేమీ లేకపోయినా.. రాజకీయంగా యాక్టివ్ గా ఉండాలని ఆశించింది ఖుష్బూ. తన పొలిటికల్ వ్యూస్ ను వెల్లడించడమే ఆమెను రాజకీయాల్లో బిజీ చేసింది. డీఎంకేలో సభ్యత్వాన్ని, పదవిని దక్కేలా చేసింది. ఆ తర్వాత అక్కడ కూడా ఓపెన్ తన అభిప్రాయాలను వెల్లడించడం తప్పైంది.. డీఎంకే నుంచి బహిష్కృతురాలైంది. ఇలాంటి వాటిని ఖాతరు చేయక.. తనకంటూ ఒకరాజకీయ వేదిక ఉండాలనే భావనతో కాంగ్రెస్ లో వచ్చి చేరింది ఖుష్బూ.
తమిళనాడులో కాంగ్రెస్ పరిస్థితేమిలో వేరే వివరించనక్కర్లేదు. అయినా అక్కడ ఖుష్బూబాగానే కష్టపడుతోంది. ఈ నేపథ్యంలో ఆమెకు కాంగ్రెస్ పార్టీ తమిళనాడు విభాగం చీఫ్ పోస్టు దక్కనుందని వార్తలు వచ్చాయి. తమిళనాడులో చాలామంది అవకాశవాద కాంగ్రెస్ లీడర్లు 2014 ఎన్నికల అనంతరం ఆ పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఇలాంటి నేపథ్యంలో ఖుష్బూ కూడా తనకు మంచి గుర్తింపు దక్కుతుందని ఆశించింది. అయితే అన్నీ అనుకున్నట్టు సాగితే అది కాంగ్రెస్ ఎందుకు అవుతుంది?
మొన్నటి వరకూ ఖుష్బూకు తమిళనాడు కాంగ్రెస్ విభాగం పగ్గాలు దక్కడం ఖాయమే.. ఈ మేరకు అధిష్టానం భరోసా కూడా ఇచ్చిందనే ప్రచారం జరిగినా, చివరకు అది ఉత్తిదే అని తేలిపోయింది. ఖుష్బూకు ఆ పదవి దక్కడం కష్టమేనని తెలుస్తోంది. ఒక మహిళ, సినీతార కింద మేం పనిచేసేది ఏంటి? అంటూ కొంతమంది కాంగ్రెస్ లీడర్లు అభ్యంతరాలు చెప్పే సరికి ఖుష్బూ కు అవకాశం లేకుండా పోయిందని సమాచారం. మరి జాతీయ స్థాయిలో ఒక మహిళ నాయకత్వంలో పని చేయడానికి లేని అభ్యంతరం.. రాష్ట్ర స్థాయిలో ఎందుకొచ్చిందో!