అంతర్జాతీయ కార్ల దిగ్గజం కియ…. దేశంలోనే తొలి ప్లాంట్ ఆంధ్రప్రదేశ్లో పెట్టింది. కరువు జిల్లా అనంతకు తరలి వచ్చింది. రూ. పదమూడు వేల కోట్ల పెట్టుబడి పెట్టి.. ఏడాదికి మూడు లక్షల కార్లను ఉత్పత్తి చేసే పరిశ్రమను… రెండేళ్లలోనే ప్రారంభించింది. కార్లను మార్కెట్లోకి విడుదల చేసింది. తొలి కారును.. అత్యంత ఆర్భాటంగా.. ప్రజాప్రతినిధుల సమక్షంలో విడుదల చేయాలనుకున్నారు. తొలి కారును… గుర్తుగా మ్యూజియంలో పెట్టుకుంటారు. కానీ.. అలా గుర్తు పెట్టుకోని విధంగా చేశారు.. వైసీపీ ప్రజాప్రతినిధులు.
తొలి కారుపై నిరసన వాక్యాలు రాసిన వైసీపీ ఎంపీ..!
తొలి కారును వైసీపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆవిష్కరించారు. రోజా సహా.. ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తమ ప్రాంతంలో అంత పెద్ద పరిశ్రమ వచ్చినందుకు.. సంతోషపడి… తమ గడ్డపై నుంచి మేడిన్ ఆంధ్రా కార్లు తయారై.. ప్రపంచవ్యాప్తంగా తిరగబోతున్నందుకు.. సంతోషపడాల్సిన వైసీపీ ప్రజాప్రతినిధులు.. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో.. చిటపటలతోనే వ్యవహరించారు. ఆవిష్కరణ కార్యక్రమాన్ని కియా యాజమాన్యం మర్చిపోయేలా చేసుకునేలా వ్యవహరించారు. ముఖ్యంగా ఎంపీ గోరంట్ల మాధవ్… తొలి కారుపై… నిరసన వాక్యాలు రాసి.. కియా పరిశ్రమ.. యాజమాన్యం అనంతకు ఎందుకు వచ్చామా అనుకునేలా చేశారు.
చారిత్రక సందర్భంలో అభినందనలు తెలుపడం కనీస మర్యాద..!
ఓ వైపు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెనుకబడిన రాయలసీమ లో పరిశ్రమ ల అభివృద్ధి కి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ప్రకటించారు. అయితే.. మిగతా నేతలు మాత్రం.. యాజమాన్యాన్ని బెదిరించే ధోరణిలో మాట్లాడారు. ఎంపీ గోరంట్ల మాధవ్… స్థానికులకు ఉద్యోగాలివ్వలేదని.. మండిపడ్డారు. ఆదే తరహా వాక్యాలు.. తొలి కారుపై రాసి సంతకం పెట్టారు. నిజానికి అలాంటి సందర్భం ఏదైనా ఉంటే… తొలి కారుపై.. మంచి వాక్యాలు రాసి.. ఆ కారు ప్రజాదరణ పొందాలని.. ఆ ప్లాంట్ దిన దిన ప్రవర్థమానమై ఎదగాలని… కోరుకుంటారు. అలా రాసి సంతకం పెట్టడం కనీస మర్యాద. కానీ వైసీపీ ఎంపీలు.. కియా కంపెనీకి ఆ మర్యాద కూడా ఇవ్వలేదు. శుభ సందర్భంలోనూ.. నిరసన వాక్యాలు రాసి.. సంతకం చేసి… పారిశ్రామికవేత్తలకు ఏపీపై బ్యాడ్ ఇమేజ్ పడేలా చేశారు.
వైసీపీ ఎంపీ తీరుతో పారిశ్రామికవేత్తలకు ఏ సందేశం పంపినట్లు..?
ఇప్పటికే.. ఏపీ ప్రభుత్వం చేసిన చట్టాల వల్ల.. పారిశ్రామికవేత్తలు.. ఇతర రాష్ట్రాల వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో.. వైసీపీ నేతల తీరుతో.. అంతర్జాతీయ పెట్టుబడిదారులు కూడా.. మరింత.. భయపడే పరిస్థితి వచ్చిందన్న అభిప్రాయం.. కియా కారు ప్రారంభోత్సవం జరిగిన తీరు చూస్తే అర్థమైపోతుంది. అంతర్జాతీయ మీడియా కూడా.. కియా కార్ ప్రారంభోత్సవానికి వచ్చింది. ఆ మీడియా ముందు.. వైసీపీ ఎంపీలు.. యాజమాన్యాన్ని దాదాపుగా అవమానించారు. ఈ పరిస్థితి అంతర్జాతీయంగా ప్రచారం పొందుతుంది. అంతిమంగా అది పారిశ్రామికవేత్తల్లో ఏపీపై.. మరో విధమైన అభిప్రాయం ఏర్పడటానికి కారణం అవుతుంది. దాని వల్ల ఎవరికి నష్టం..?