ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రగతికి చేస్తున్న ప్రయత్నాలు క్రమేపీ ఫలిస్తున్నాయి. తాజాగా కొరియా దేశానికి చెందిన కియా కార్ల కంపెనీ రాష్ట్రంలో కార్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పడానికి ముందుకొచ్చింది. గురువారం రాష్ట్ర ప్రభుత్వానికీ, కియా కంపెనీకి మధ్య అవగాహన ఒప్పదం కుదిరింది. ముఖ్యమంత్రి సమక్షంలో కియా అధ్యక్షుడు హోన్ యు పార్క్, రాష్ట్ర పరిశ్రమల కార్యదర్శి ఆరోఖ్యరాజ్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
అనంతపురం జిల్లా పెనుకొండలో కియా తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేస్తారు. 12 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రారంభించే ఈ కార్ల కంపెనీ వల్ల నాలుగు వేల మందికి ప్రత్యక్షంగానూ, 7వేల మందికి పరోక్షంగానూ ఉపాధి కలుగుతుందంటున్నారు. 2018 చివరి నాటికి ఉత్పత్తి ప్రారంభిస్తామని కియా అధ్యక్షుడు పార్క్ చెబుతున్నారు. ఇక్కడ తయారుచేసే కార్లలో 90శాతం దేశీయంగానే అమ్ముతామంటున్నారాయన. ఏటా 3 లక్షల కార్లను ఉత్పత్తి చేయాలన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. కరవు పీడిత ప్రాంతమైన అనంతపురం జిల్లాలో ఇలాంటి పరిశ్రమలు మరిన్ని ఏర్పాటైతే, అక్కడి ప్రజల కష్టాలు కొంతమేరకైనా తీరతాయి.