RRR ని గుర్తుకు తెస్తూ తన సినిమాకు BRB అనే టైటిల్ పెట్టాడు కిచ్చా సుదీప్. BRB అంటే ‘బిర్లా రంగా బాషా’ అన్నమాట. ‘బిర్లా – రంగా’ అనే టైటిల్ ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే దానికి ఈసారి ‘బాషా’ తోడయ్యాడు. ఈరోజు కిచ్చా సుదీప్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన కొత్త సినిమా టైటిల్ ని అధికారికంగా ప్రకటించాడు. టైటిల్ ప్రకటన కూడా వినూత్నంగా జరిగింది. టైటిల్ కోసం విడుదల చేసిన టీజర్లో మూడు ప్రపంచాల్ని చూపించాడు దర్శకుడు. అవన్నీ ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ మూడు పాత్రల్లోనూ సుదీప్ కనిపించనున్నాడు. ఇది త్రిపాత్రాభినయం అనుకోవాలా? లేదంటే ఒకే పాత్రలో మూడు షేడ్స్ ఉంటాయా? అనేది ఆసక్తిని కలిగిస్తోంది. 2209 ఏడీలో జరిగే కథ ఇది. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, ఈఫిల్ టవర్, తాజ్ మహల్ ఇవి మూడూ మూడు విభిన్నమైన ప్రపంచాలకు ఆనవాలుగా కనిపిస్తోంది. ఈ మూడింటికీ ఈ కథకూ సంబంధం ఏమిటో తెరపై చూడాలి. అనూప్ భండారి ఈ చిత్రానికి దర్శకుడు. నిరంజన్ రెడ్డి నిర్మాత. అన్ని ప్రధానమైన భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది.
సుదీప్ – అనూప్ భండారి కాంబోలో ఇది వరకు ‘విక్రాంత్ రోణా’ అనే సినిమా వచ్చింది. కన్నడలో ఈ సినిమా పెద్ద హిట్. అందుకే ఈ కాంబోపై అంచనాలు భారీగా ఉన్నాయి. ‘హనుమాన్’ నిర్మాత నిరంజన్ రెడ్డి తోడవ్వడం ఈ ప్రాజెక్ట్ కు మరో ప్లస్ పాయింట్. సుదీప్ కెరీర్లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా అని నిర్మాత ప్రకటించారు. కథానాయిక, ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తారు.