అతని దీక్ష ముందు ఒలింపిక్ ఛాంపియన్ తలొంచాడు. అతని పదునైన రిటర్న్‌లు.. ధాటైన స్మాష్‌లకు సమాధానం లేకపోయింది. ఫలితంగా వారం రోజుల వ్యవధిలో రెండో సూపర్ టైటిల్ అతని ఒడిలో వాలింది. గుంటూరుకు చెందిన తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ అద్భుతమైన ఆట తీరు షటిల్ ప్రపంచంలో అతడిని శిఖరాగ్రంపై నిలబెట్టింది. ఆదివారం ఉదయం జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్లో ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్‌పై శ్రీకాంత్ అలవోకగా విజయం సాధించాడు. రెండు వరుస సెట్లలో ప్రత్యర్థిని మట్టికరిపించాడు. అతని ఆట తీరుకు లాంగ్ అచ్చెరువొందాడు. 24 ఏళ్ళ కిడాంబి శ్రీకాంత్ నమ్మాళ్వార్ తన షటిల్ కెరీర్లో ఇంతవరకూ 138 విజయాలను చవిచూశాడు. 75 ఓటములను రుచి చూశాడు. మొత్తం పది టైటిల్స్‌ను కైవశం చేసుకున్నాడు. 2015 జూన్ నాటికి 3 వర్యాంకులో ఉన్న కిడాంబి ప్రస్తుత ర్యాంకు 11. 2011 కామన్వెల్త్ గేమ్స్‌లో అతడి ప్రతిభ బయటపడింది. మిక్స్డ్ డబుల్స్ పోటీలో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. పుల్లెల గోపీచంద్ శిక్షణలో రాటుదేలిన శ్రీకాంత్ ఆదివారం నాటి గెలుపుతో షటిల్ ప్రపంచంలో తన పేరు మార్మోగేలా చేసుకున్నాడు. వారం క్రితం ఇండోనీషియా సూపర్ సిరీస్ విజేతగా నిలిచిన ఈ ఆటగాడు ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్‌లోనూ విజయకేతనాన్ని ఎగురవేశాడు. షటిల్ ప్రపంచంలో రారాజైన చైనా నైపుణ్యాన్ని ప్రశ్నించేలా అతడి ఆట తీరు సాగింది. ఒలింపిక్ ఛాంపియన్ లాంగ్… శ్రీకాంత్ షాట్లకు నిరుత్తరుడై చూడటం మినహా ఏమీ చేయలేకపోయాడు. ఒలింపిక్ చాంపియన్‌కు అవకాశమీయకుండా వరుస సెట్లలో నెగ్గడం మామూలు విషయం కాదు. తెలుగు క్రీడా యవనికపై మెరిసిన మరో క్రీడాకారుని పట్ల ఆంధ్ర ప్రభుత్వం ఎలా స్పందింస్తుందో చూడాల్సి ఉంది. ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధుపై చంద్రబాబు వరాల వర్షం కురిపించారు. స్థలమిచ్చారు. డిప్యుటి కలెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. తెలుగు గడ్డ కీర్తిని పతాకస్థాయిలో నిలిపిన శ్రీకాంత్ తల్లితండ్రులు తమ బిడ్డ సాధించిన ఘనతను చూసి, ఉప్పొంగిపోతున్నారు. స్వీట్లు పంచి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.