జనసేన అధినేత పవన్ కల్యాణ్… రాజమండ్రి కవాతు సభలో చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు. మావోయిస్టుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన తమ భర్తలను అవమానించారంటూ.. కిడారి సర్వేశ్వరరావు భార్య పరమేశ్వరి, సివేరి సోమ భార్య ఇచ్చావతి.. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. ” టీడీపీలోకి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేను చంపింది గోదావరి జిల్లా నుంచి నక్సలిజంలోకి వెళ్లిన ఆడపడుచు.. ఆమె ఎందుకు అటువైపు వెళ్లిందో ఆలోచించుకోవాలని” పవన్ వ్యాఖ్యానించారు. తన భర్త హత్యకు గురై నెల కూడా కాకముందే ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలుచేయడం తమనెంతగానో బాధించిందని .. కిడారి గురించి ప్రజలందరికీ తెలుసని ఆమె తెలిపారు. తమకు ధైర్యం ఇవ్వాలి తప్ప ఇలాంటి వ్యాఖ్యలతో బాధపెట్టొద్దని ఆమె కోరారు.
మావోయిస్టులకు అనుకూలంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి పరమేశ్వరి డిమాండ్ చేశారు. మావోయిస్టు మీనాదే ప్రాణమా?..కిడారి, సోమలవి ప్రాణాలు కావా? అని ప్రశ్నించారు. నిజాయితీ గల నేతలు చనిపోతే విమర్శించడం తగదన్నారు. శవ రాజకీయాలు మానుకోవాలని పవన్ కు సూచించారు. సివేరి సోమ, కిడారి సర్వేశ్వరరావులను మావోయిస్టులు కాల్చి చంపినప్పుడు పవన్ కల్యాణ్ స్పందించలేదు. అనూహ్యంగా వారికి వ్యతిరేకంగా.. మావోయిస్టులను సమర్థిస్తున్నట్లుగా మాట్లాడటం కలకలం రేపుతోంది. రాజకీయ అంశాలపై మాట్లాడుతూ.. పవన్ ఒక్కసారిగా మావోయిస్టుల టాపిక్ తీసుకొచ్చారు. ఇది కిడారి, సోమ కుటంబ సభ్యులను… నివ్వెర పరిచింది. తమ భర్తలను చంపడమే న్యాయమన్నట్లుగాప వన్ కల్యాణ్ మాటలుండటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
మరో వైపు పాడేరులో.. కిడారి అనుచరులు సమావేశం నిర్వహించారు.పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఖండించారు తక్షణం పవన్ కల్యాణ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పవన్ వ్యాఖ్యలు గిరిజనుల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ విషయంలో వపన్ కల్యాణ్ స్పందిస్తారో లేదో వేచి చూడాలి..!