ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం నుంచి.. కిడారి శ్రవణ్ రాజీనామా చేయడం ఖాయంగా కనబడుతోంది. ఒక వేళ పదో తేదీ లోపు ఆయన రాజీనామా చేయకపోతే… ఆటోమేటిక్‌గా.. పదవి ఊడిపోతుంది. అది మరింత అవమానకరం. అందుకే.. కిడారి శ్రవణ్‌తో రాజీనామా చేయించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి రావడానికి టీడీపీ అధినేత చంద్రబాబు… రాజకీయ వ్యూహమే కారణం.
కిడారి రాజీనామా చేయాల్సిన పరిస్థితి తెచ్చింది చంద్రబాబే… !
ఆరు నెలల కిందట.. ఎన్నికలకు ముందు.. అటు ఎస్టీ వర్గాలు.. ఇటు ముస్లిం వర్గాలను ఆకట్టుకునేందుకు రెండు మంత్రి పదవులను ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. ఆ మేరకు కర్నూలు జిల్లాకు చెందిన ఫరూక్ కు… మావోయిస్టుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన కిడారి సర్వేశ్వరరావు కుమారుడికి… మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఫరూక్ ఎమ్మెల్సీగా ఉండటంతో.. ఎలాంటి సమస్యా రాలేదు. కానీ కిడారి శ్రవణ్.. ఉభయసభల్లోనూ సభ్యుడు కాదు. అయితే.. రాజ్యాంగంలో ఆరు నెలల నిబంధన ఉండటంతో… ఆ లోపు ఎన్నికల ఫలితాలు కూడా వస్తాయని.. అందు వల్ల.. ఇబ్బంది రాదని అనుకున్న ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయించారు. ఆరు నెలల్లోనూ ఏ సభలోనూ సభ్యుడు కాపోవడంతో.. కిడారి శ్రవణ్… మాజీ కాబోతున్నారు. అటు ఎమ్మెల్యేగా కానీ.. ఇటు ఎమ్మెల్సీగా కానీ కాకుండా.. ఆరు నెలల పాటు మంత్రిగా ఉండి రికార్డు సృష్టించారు కిడారి శ్రవణ్.
చట్టసభ సభ్యుడు కాకుండా ఆరు నెలలు మంత్రిగా శ్రవణ్..!
అయితే కిడారి రాజీనామా చేయాల్సిన పరిస్థితి రావడానికి చంద్రబాబే కారణమన్న విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఏదో ఓ కోటాలో ఆయనను ఎమ్మెల్సీగా పంపిస్తే ఈ సమస్య వచ్చి ఉండేది కాదంటున్నారు. అయితే.. కిడారి శ్రవణ్ పై.. ప్రజల్లో ఉన్న సానుభూతిని రాజకీయంగా ఉపయోగించుకోవాలన్న లక్ష్యంతోనే.. చంద్రబాబు ఆయనను మంత్రిని చేశారు కాబట్టి… ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి నిలబెట్టారు. ఆయన గెలిస్తే మళ్లీ మంత్రి పదవి ఇస్తారని.. టీడీపీ వర్గాలు చెబుతున్నారు. అయితే… ఓ యువ మంత్రి … రాజకీయ భవితవ్యాన్ని ఇలా… రాజ్యాంగ విరుద్ధంగా..ప్రారంభించడం మంచిది కాదేమోనన్న చర్చ కూడా నడుస్తోంది.
నాడు హరికృష్ణపై చంద్రబాబు ప్రయోగించింది ఇదే అస్త్రం..!
గతంలో కూడా.. చంద్రబాబు ఇప్పుడు కిడారి శ్రవణ్ తో చేసిన రాజకీయమే.. నందమూరి హరికృష్ణతోనూ చేశారు. ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడిని చేసి… సీఎం పీఠం ఎక్కిన తర్వాత హరికృష్ణకు చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు. కానీ ఆయన ఏ సభలోనూ సభ్యుడు కాదు. ఆరు నెలల్లోపు.. ఉపఎన్నికలు రావాల్సి ఉన్నా… రాలేదు. అప్పటికి శాసనమండలి కూడా.. రద్దయిపోయింది. దాంతో ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. చివరికి ఆరు నెలలు పూర్తయ్యే సమయంలో.. హరికృష్ణ రాజీనామా చేశారు. మళ్లీ ఆయన మంత్రి కాలేకపోయారు. ఇప్పుడా పరిస్థితి… కిడారి శ్రవణ్‌కు వచ్చింది.