నక్సలైట్లు దేశభక్తులు అన్నారు ఎన్టీఆర్. తనది మావో భావజాలం అని కేసీఆర్ ప్రకటించుకున్నారు. పవన్ కల్యాణ్ కూడా వారి భావాజాలానికి ఆకర్షితులయ్యారు. ఎందుకంటే నక్సలిజం అంటే.. పోలీసుల్ని , రాజకీయ నేతల్ని చంపడం అనే భావన రాక ముందు వారి పోరాటం యువతను కదిలించింది. అడవుల్లోకి వెళ్లి అన్యాయంపై పోరాడాలన్న ఉడుకు రక్తం ఉన్న వారికి దారి చూపించేది. పీడితులు, బాధితులు..వారి తరపున పోరాడాలనుకునేవారికి నక్సలిజం ఓ మార్గం అయ్యేది. కానీ ఇప్పుడు నక్సల్స్ అంతమైపోతున్నారు.. నక్సలిజం కూడా అంతర్థానమైపోతోంది.
వరుస ఎన్ కౌంటర్లతో నక్సల్స్ నిర్మూలన
ఈ ఏడాది తొమ్మిది నెలలు గడిచాయి. ఎన్ కౌంటర్ జరగని నెల లేదు. అక్కడా ఇక్కడా అనే తేడా లేదు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఉన్న ప్రతి చోటా ఎన్ కౌంటర్లు జరిగాయి. అగ్రనేతలంతా హతమవుతున్నారు. అబూజ్ మడ్‌లో జరిగిన ఎన్ కౌంటర్ లో 32 మంది చనిపోయారు. ఐదు రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ నక్సలైట్లను చంపేశామని పోలీసులు ప్రకటించారు. అంటే నాయకత్వం అంతా చనిపోయింది. చివరికి జగన్ పేరుతో తెలుగు మీడియాకు సమాచారం పంపే నక్సలైట్‌ను కూడా ఇటీవల ఎన్ కౌంటర్ చేసేశారు.
నక్సలిజంపై ఆకర్షితులయ్యేవారూ లేరు !
ఒకప్పుడు నక్సలిజానికి ఆకర్షితులయ్యేవారు ఉండేవారు. ఇప్పుడు అడవుల్లో ఉండే ఆదివాసీలు కూడా నక్సల్స్ గా మారడం లేదు . ప్రపంచం మారడం ఓ కారణం అయితే పరిస్థితుల్లో మార్పులు రావడం మరో కారణం. ప్రపంచీకరణ అని చెప్పినా.. మరో కారణం చెప్పినా జీవన ప్రమాణాలు పెంచుకోవాలని అవకాశాలు అందుకోవాలని అడవి బిడ్డలు కూడా ఆశపడుతున్నారు. వారెవరూ ఇప్పుడు అడవుల్లో ఉండి తుపాకీ గొట్టం ద్వారా విప్లవం సాధిస్తామని అనుకోవడం లేదు. అందుకే కొత్తగా నక్సల్స్‌లో చేరేవారు లేరు.
మరో ఏడాదిలో నక్సలిజం అంతమే – కానీ శాశ్వతం కాకపోవచ్చు !
2026 నాటికి నక్సలైట్లను అంతం చేస్తామని అమిత్ షా గతంలో ప్రకటించారు. ఆయన మాటలు నిజమవుతున్నాయి. అయితే నక్సలిజాన్ని అంతం చేయగలమని ఆయన అనుకుంటున్నారో లేదో తెలియదు. నక్సలైట్లు మొత్తాన్ని అంతం చేస్తే నక్సలిజం అంతం కాదు.అదో భావజాలం. సమాజంలో మళ్లీ యువతలో అలజడి రేగే పరిస్థితులు వస్తే వారికి అడవులు ఉండనే ఉంటాయి. కాకపోతే కొత్త తరహా పోరాటాలు ఉండవచ్చు. అలాంటి పరిస్థితులు రాకూడదని.. ఎవరూ ఎన్ కౌంటర్ల పేరుతో బలి కావడం లేదా… ఈ తీవ్ర వాద భావజాలం వల్ల ఎవరూ బాధితులుగా మారకూడదని ఆశిద్దాం..