కిమ్ జాంగ్ ఉన్… అలియాస్ కిమ్ .. ఉత్తరకొరియా అధ్యక్షుడు. ఆయన గారి పాలనా లీలల గురించి ప్రపంచం అంతా చెప్పుకునే కథలు విచిత్రంగా ఉంటాయి. నియంత పాలకుడు అయిన కిమ్ .. ప్రజల కట్టూబొట్టూను కూడా నిర్దేశిస్తారు. ప్రజలకు ఇంటర్నెట్ కూడా అందుబాటులో ఉండదు. ఉత్తరకొరియాలో మనుషుల్ని చంపడం అనేది చాలా చిన్న విషయం అని ఎక్కువ మంది అనుకుంటారు. ఆయన ఘన కార్యాల గురించి చాలా విన్నాం అందుకే మన దేశంలో ఎవరు కాస్త అతి చేసినా .. ఆ లీడర్ ను కిమ్ తో పోలుస్తూంటారు. ఇక్కడ కాస్త విచిత్రమైన విషయం ఏమిటంటే.. కిమ్ కూడా మారిపోయాడు.
ఇటీవలి కాలంలో కిమ్ గురించి పాజిటివ్ వార్తలే బయటకు వస్తున్నాయి. కొద్ది రోజుల కిందట ఉత్తరకొరియాను వరదలు వణికించాయి. ఇప్పుడు కూడా ఉత్తరకొరియా వరద ముప్పులోనే ఉంది. దీంతో కిమ్ మోకాలి లోతు నీళ్లలో బాధితుల్ని పరామర్శిస్తున్నట్లుగా.. చిన్న పిల్లలకు ఆహారం అందిస్తున్నట్లుగా మీడియాకు ఫోటోలు, వీడియోలు అందుతున్నాయి. ఓ మానవత్వం ఉన్న మనిషిగా ఆయనను ప్రజెంట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉత్తర కొరియా నుంచి వస్తున్న సమాచారం అంతర్జాతీయ వ్యవహారాలు చూసే జర్నలిస్టుల్ని కూడా ఆశ్చర్యపరుస్తోంది. కిమ్ ఇలా మారిపోయాడా అని ఆశ్చర్యపోతున్నారు.
కిమ్ అత్యంత కర్కోటకుడని అందరూ అనుకుంటారు. పెంచిన మామను కూడా నిర్దాక్షిణ్యంగా చంపేయించారని అంటారు. అందులో నిజం ఎంతో తెలియదు కానీ.. ఆయన ఇమేజ్ మాత్రం బయట ప్రపంచంలో చాలా దారుణంగా ఉంటుంది. ఉత్తరకొరియాలో పరిస్థితుల్ని బయటకు తెలియకుండా చేస్తున్న ఆయన అంతకు మించి చేస్తారని ఎవరైనా అనుకుంటే తప్పేమీ లేదు. కానీ ఇప్పుడు తాను మారిపోయానని సంకేతాలు పంపుతూండటమే అసలు విచిత్రం. మానవత్వం ఉన్న నతనని ఆయన బయట ప్రపంచానికి చెప్పుకుంటున్నారు. మామూలుగా అయితే ఆయనకు ఆ అవసరం లేదు. కానీ ఎందుకు చేస్తున్నారో ?