అమెరికా అధ్యక్షుడు, ఉత్తర కొరియా అధ్యక్షుడు కలుసుకోవడం.. ఇది కచ్చితంగా చారిత్రకమే. ఎందుకంటే, 1950ల తరువాత, అంటే.. కొరియన్ యుద్ధం అయిన దగ్గర నుంచీ ఈ రెండు దేశాలకు చెందిన అధ్యక్షులు కనీసం ఫోన్లో కూడా పలకరించుకున్న సందర్భాలు లేవు. అంతేకాదు, రెండు వైపులా ఉద్రిక్త వాతావరణమే. ఒకరంటే ఒకరికి పడని పరిస్థితే ఉంటూ వచ్చింది. ఇలాంటి నేపథ్యం ఉన్న ఇరు దేశాధినేతలు డోనాల్డ్ ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్ లు సింగపూర్ వేదికగా కలుసుకోవడం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆసక్తికరమైన అంశంగానే చూస్తోంది. ఈ ఇద్దరూ కలవడం, సృహృద్భావ వాతావరణంలో చర్చలు జరుపుకుని, ఒక డాక్యుమెంట్ పై సంతకాలు చేయడం అనేది చారిత్రకమే.
ఉత్తర కొరియా అణ్వాయుధాలను విడిచిపెడితే, ఆ దేశ భద్రతను తమ బాధ్యతగా స్వీకరిస్తామనీ, కొరియాలో శాంతిని నెలకొల్పేందుకు అన్ని విధాలుగా సాయం చేస్తామని అమెరికా ప్రకటించింది. అయితే, అణ్వాయుధాలను త్యజించేందుకు కిమ్ ఎంత వరకూ సిద్ధంగా ఉన్నారనేది కూడా చర్చనీయాంశమే. కాకపోతే, కొన్ని నెలల కిందట ఇందుకు సానుకూలంగా కిమ్ ప్రకటనలు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. తమ ఇద్దరి మధ్యా ప్రత్యేక స్నేహం ఏర్పడిందనీ, ఇద్దరం ఏదో చేయాలనే సంకల్పంతో ఉన్నామనీ ట్రంప్ ఈ భేటీ అనంతరం ప్రకటించడం విశేషం. ప్రపంచం ఒక గొప్ప మార్పు చూడబోతోందనీ, గతాన్ని వదిలెయ్యాలని రెండు దేశాధినేతలం నిర్ణయించామనీ, ఇదో చారిత్ర సమావేశమని కిమ్ అన్నారు.
ఈ భేటీపై మిశ్రమ స్పందన అమెరికాలో వస్తోందని వార్తలొస్తున్నాయి. నియంత మనస్తత్వం ఉన్న కిమ్ తో దోస్తీ కోసం అర్రులు చాచడమేంటనే విమర్శలు ఓపక్క వినిపిస్తుంటే… వ్యాపార దృక్పథం ఉన్న ట్రంప్ కేవలం శాంతి కోసమే ఈ ప్రయత్నం చేస్తున్నారని మెచ్చుకుంటున్నవారూ లేకపోలేదు! నిజానికి, ఈ ఇద్దరి దేశాధినేతల మధ్య ఈ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేట్టుగా వాగ్వాదాలు నడిచిన సంగతి తెలిసిందే. దేశాధినేతల స్థాయి మరచిపోయి ఈ ఇద్దరూ ఒకరినొకరు వ్యక్తిగతంగా ఏ స్థాయిలో విమర్శించుకున్నారో తెలిసిందే. ఏదైతేనేం, ట్రంప్, కిమ్ ల మధ్య భేటీ ఓరకంగా మంచి పరిణామమనే చెప్పాలి.
భవిష్యత్తులో కిమ్ ఎలా వ్యవహరిస్తారో తెలీదుగానీ.. అగ్రరాజ్యం అమెరికాతోపాటు ఇతర దేశాలతోనూ ఇదే తరహా మైత్రి ధోరణి ప్రదర్శిస్తే ఉత్తర కొరియా రూపురేఖలు మారే అవకాశం ఉంటుంది. ఇతర దేశాలతో రాకపోకలు పెంచుకుంటే వ్యాపారపరంగా కూడా ఆ దేశం అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువ. మరి, ఈ రెండు దేశాల మధ్య మైత్రి మున్ముందు ఎంత బలమౌతుందో చూడాలి.