ప్రపంచంలో సద్దాం హుస్సేన్, మొహమ్మద్ గడాఫీ, జియా ఉల్ హక్ వంటి నియంతలను చూసాము. ఆ కోవకే చెందిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిం జాంగ్ ని చూస్తున్నామిప్పుడు. అయితే అతను కేవలం ఒక నియంతలాగ తన దేశాన్ని పాలించుకొంటే ఎవరికీ ఇబ్బంది ఉండదు కానీ ఒక ఉగ్రవాదిలాగ…యుద్ధోన్మాదిలాగ…ఒక సైబర్ నేరగాడిలాగ వ్యవహరిస్తుండటంతోనే అందరికీ ఒక పెను సమస్యగా మారాడు. కొన్ని రోజుల క్రితం అతను వాషింగ్టన్ పట్టణంపై అణుబాంబులతో దాడులు చేసి ఆ నగరాన్ని సర్వనాశనం చేసినట్లుగా ఒక వీడియో రూపొందించి విడుదల చేసి తనలోని పైశాచికానందాన్ని ప్రపంచానికి చాటుకొన్నాడు. మళ్ళీ తాజాగా ఒక సంచలన ప్రకటన చేసాడు. అమెరికా, దక్షిణ కొరియా దేశాలకు చెందిన అధికారిక వెబ్ సైట్లను త్వరలో హాక్ చేసి ఆ రెండు దేశాలకు తన సత్తా ఏమిటో త్వరలో రుచి చూపబోతున్నట్లు ప్రకటించేడు. ఉత్తర కొరియాలో ఫేస్ బుక్, ట్వీటర్, యూ ట్యూబ్ వంటి సామాజిక వెబ్ సైట్లన్నిటినీ నిషేధిస్తున్నట్లు ప్రకటించేడు.
ఒక దేశాధ్యక్షుడు ఇంత యుద్ధోన్మాదంతో విర్రవీగడం చాలా విచిత్రంగా ఉంది. అతని ఈ విచిత్ర వైఖరి వలన ఉత్తర, దక్షిణ కొరియాలకే కాకుండా ప్రపంచ దేశాలకి కూడా ఒక పెను సవాలుగా మారాడు. ఉత్తర కొరియాలో భారీగా అణ్వాయుధాలు పోగు చేసిపెట్టుకొని ప్రపంచ దేశాలకి ఈవిధంగా తరచూ సవాళ్ళు విసురుతున్నాడు. ఆ కారణంగానే అతని సవాళ్ళను దక్షిణ కొరియా, అమెరికా తదితర దేశాలు స్వీకరించడానికి వెనుకంజ వేస్తున్నాయి. కానీ అవి వెనుకంజ వేస్తున్నా అతను మాత్రం వాటిని ఏదో విధంగా రెచ్చగొట్టి యుద్ధం ప్రారంభించాలని తహతహలాడుతున్నాడు. ఆ ప్రయత్నంలోనే అమెరికా, దక్షిణ కొరియా దేశాలకు చెందిన అధికారిక వెబ్ సైట్లను హాక్ చేయడానికి సిద్దపడుతున్నాడని స్పష్టం అవుతోంది. మరి దీని విపరీత పరిణామాలు ఏవిధంగా ఉండబోతున్నాయో, ఏ దేశాలు దానికి మూల్యం చెల్లించబోతున్నాయో ఊహించడానికి కూడా భయం వేస్తోంది.