కింగ్ మేకర్ అంటూ టీడీపీకి వచ్చిన హైప్‌కు కేటాయించిన పదవులు, శాఖలకు పొంతన లేకుండా పోయింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి వచ్చిన హైప్‌ను బట్టి చూస్తే.. అనుకున్న విధంగా పదవులు, కీలక శాఖలు రాలేదు . కింగ్ మేకర్ గా టీడీపీని జాతీయ రాజకీయ నేతలు అభివర్ణించారు. అయితే కేబినెట్ లో ఆ స్థాయిలో ప్రాధాన్యం మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.
నాలుగైదు కేంద్ర మంత్రి పదవులు, స్పీకర్ పోస్టును టీడీపీ అడిగిందని జాతీయ మీడియా ప్రచారం చేసింది. చివరికి ఒక్క కేబినెట్, ఒక్క సహాయ మంత్రి పదవితో సరిపెట్టారు. వారి శాఖలు కూడా ఏపీకి అంతగా ఉపయోగపడేవి కావు. రామ్ మోహన్ నాయుడికి పట్టణాభివృద్ధి శాఖను ఇచ్చినా ఏపీ కి రాజధాని నిర్మించుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందని అనుకున్నారు. కానీ గతంలో అశోక్ గజపతిరాజుకు ఇచ్చిన పౌర విమానయానమే ఇచ్చారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న బోగాపురం ఎయిర్ పోర్టును వేగంగా పూర్తి చేసుకునే అవకాశం మాత్రం లభిస్తుంది.
గుంటూరు ఎంపీ పెమ్మసాని మెడికల్ రంగంలో నిపుణుడు. ఆయనకు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి పదవి కేటాయిస్తారేమో అనుకున్నారు. కానీ గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖను కేటాయించారు. ఇద్దరు ఎంపీలు ఉన్న కర్ణాటకలోని జేడీఎస్ చీఫ్ కుమారస్వామికి భారీ పరిశ్రమల శాఖ కేటాయించారు. మొత్తంగా టీడీపీకి నిరాశే ఎదురయింది. కింగ్ మేకర్ అంటూ జాతీయ మీడియాలో జరిగిన ప్రచారంతో మోదీ మళ్లీ కోపం తెచ్చుకున్నారేమో కానీ.. హైప్ మాత్రమే టీడీపీకి మిగిలింది..