జబర్దస్త్… ఈ షో తెలుగింట్లో నవ్వుల్ని పొంగి పొరలించింది. ప్రయాణంలోనూ మెబైల్స్‌లో, ట్యాబుల్లో.. జబర్దస్త్‌ని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ షో ద్వారా చాలామంది నటీనటులు పరిచయమయ్యారు. ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారు. కొంతమంది స్టార్లయిపోయారు. జీవితాల్లో సెటిలైపోయారు. జబర్దస్త్‌కి వచ్చి, స్నేహితులైన వాళ్లు.. `అన్నా.. బావా` అంటూ బంధాలు కలుపుకొన్న వాళ్లు ఎంతో మంది. అయితే ఇప్పుడు వాళ్లలో వాళ్లకే `జబర్దస్త్` చిచ్చు పెడుతోంది. `నువ్వెంత అంటే నువ్వెంత` అనేలా చేసింది.
చాలా కాలం క్రితమే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాడు కిరాక్ ఆర్పీ. ఇప్పుడు తను ఇచ్చిన స్టేట్మెంట్లు, మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్పై చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. జబర్థస్త్‌లో ఫుడ్ అస్సలు బాగోదని, ట్రీట్మెంట్ ఘోరమని, నటీనటులకు అస్సలు గౌరవమే ఇవ్వరని దుమ్మెత్తిపోశాడు ఆర్పీ. జబర్దస్త్ వల్ల తాము బాగుపడలేదని, తమ వల్లే జబర్దస్త్ బాగుపడిందని షాకింగ్ కామెంట్లు గుప్పించాడు. ఇవి తీవ్ర దుమారం రేపాయి.
ఆర్పీ ఏ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాడో, అదే ఛానల్ లో హైపర్ ఆది, రామ్ ప్రసాద్ ప్రత్యక్షమయ్యారు. ఆర్పీ కామెంట్లని తప్పుపట్టారు. జబర్థస్త్ వల్లే అందరూ ఎదిగారని, అది తల్లిలాంటిదని… మల్లెమాలకు సపోర్ట్ గా నిలబడ్డారు. ఆర్పీ అలా ఎందుకు మాట్లాడాడో అర్థం కాలేదన్నారు. అంతేకాదు. `జబర్థస్త్`ని పొగుడుతూ… ఇది వరకు ఆర్పీ చేసిన కామెంట్లని వీడియోల సాక్షిగా చూపించారు. అప్పుడు జబర్థస్త్ అమ్మ అయినప్పుడు.. ఇప్పుడు కాకుండా ఎలా పోతుందని ప్రశ్నించారు.
ఇప్పుడు మళ్లీ ఆర్పీ.. అదే ఛానల్ లో కూర్చున్నాడు. తనని కౌంటర్ చేసిన ఆది, రామ్ ప్రసాద్‌లపై విరుచుకుపడ్డాడు. తాను ఎవరికీ ఊడిగం చేయనని, కాకా పట్టనని, నిజం నిజంలా మాట్లాడతానని యధావిధిగా రెచ్చిపోయాడు. అంతే కాదు.. పరోక్షంగా ఆది, రాం ప్రసాద్ లకు కూడా కౌంటర్లు వేశాడు. ఇలా.. జబర్దస్త్ కి వ్యతిరేకంగా ఆర్పీ, సపోర్ట్ గా.. ఆది, రాం ప్రసాద్.. వాదించుకోవడం `జబర్దస్త్`ని ఇంత వరకూ చూసి ఎంజాయ్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు మింగుడు పడడం లేదు. జబర్దస్త్‌లో ఉన్నంత కాలం.. నవ్వుకొంటూ స్నేహితుల్లా కలిసి మెలిసి తిరిగిన వీళ్లంతా ఇప్పుడు ఎడమొహం పెడమొహంలా మారిపోయారు.