ఎదిగేవాడ్ని చూస్తే ఓర్వలేనితనం. కష్టాలు పడుతూ, లేస్తూ, నిలబడినవాడ్ని చూస్తే… అసూయ. మళ్లీ మళ్లీ కింద పడేయాలి అన్నంత ద్వేషం. ఇవింకా చిత్రసీమలో ఉన్నాయా? పైకి కనిపించే నవ్వులు, అభినందనలు, షేక్ హ్యాండ్లూ.. అంతా మాయేనా?
‘క’ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కిరణ్ అబ్బవరం స్పీచ్ చూస్తే… అవుననే అనిపిస్తోంది. దాదాపు పావు గంట పాటు అనర్గళంగా సాగిన కిరణ్ స్పీచ్‌లో చాలా ఆవేదన, బాధ కనిపించాయి. తెగింపు తప్ప అలసట కొంచెమైనా లేదు. పోరాటం ఆపే ప్రసక్తే లేదన్నట్టు ధాటిగా సాగిన ఆ స్పీచ్.. చాలామందిని కదిలించింది. ఈ ప్రయాణంలో కిరణ్ ఇన్ని కష్టాలు పడ్డాడా? ఇన్ని అవమానాలు ఎదొర్కొన్నాడా? అనే సానుభూతి కలిగింది.
వెనుక ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన హీరో కిరణ్ అబ్బవరం. షార్ట్ ఫిల్మ్ స్థాయి నుంచి హీరోగా మారాడు. తన తొలి సినిమా బడ్జెట్ కేవలం 60 లక్షలు. ఇప్పుడు పాతిక కోట్లతో తనతో సినిమా తీసే స్థాయికి ఎదిగాడు. కిరణ్‌ని నమ్మి నిర్మాతలు పెట్టుబడి పెడుతున్నారు. కిరణ్ కోసం దర్శకులు కథలు రాస్తున్నారు. ఎక్కడో మారు మూల నుంచి, ఓ అతి సాధారణ కుటుంబం నుంచి, కూలి పని చేసుకొని పొట్ట నింపుకొనే స్థితి నుంచి వచ్చిన ఓ కుర్రాడికి ఇంత కంటే విజయం ఏముంటుంది? ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆ కుటుంబాన్ని పోషించడానికి తల్లి ఎన్ని బాధలు పడిందో చెబుతుంటే… కిరణ్ ఆవేదన, బాధ అర్థమవుతాయి.
తొలి సినిమా హిట్టు. ఆ తరవాత వచ్చిన ‘ఎస్.ఆర్.కల్యాణమండపం’ కమర్షియల్ గా పెద్ద సక్సెస్. `వినరో భాగ్యము విష్ణు కథ` కూడా డీసెంట్ వసూళ్లే అందుకొంది. అయితే ఓ ఫ్లాప్ రాగానే, కిరణ్ పై విమర్శల జల్లు ఎక్కువైపోయేది. ఎంత కష్టపడినా కొన్ని సినిమాలు ఫలితం ఇవ్వలేదు. దాంతో అలవాటు ప్రకారమే.. `కిరణ్ పని అయిపోయింది` అంటూ నొసలు చిట్లించడం ఎక్కువైంది. ‘క’ అనే సినిమాతో పాన్ ఇండియా ప్రయత్నం చేస్తే – ‘పవన్ కల్యాణ్‌కే సాధ్యం కాలేదు. నువ్వు పాన్ ఇండియా సినిమా చేస్తావా’ అంటూ ప్రశ్నలు సంధించడం మొదలెట్టారు. ఓ సినిమాలో అయితే నేరుగా కిరణ్ ని ట్రోల్ చేశారు. కొంతమంది ‘ఈ హీరో వెనుక ఓ పొలిటీషన్ ఉన్నాడు’ అంటూ గాసిప్పులు లేవదీశారు. ఇవి కిరణ్‌కి బాగా హర్ట్ చేశాయి. ‘క’ ప్రీ రిలీజ్ వేడుకలో కిరణ్ అంత ఆవేదన వ్యక్తం చేశాడంటే అందుకు ఇవన్నీ కారణాలే.
‘కిరణ్‌తో మీ ప్రాబ్లం ఏమిటి? కిరణ్ అనేవాడు ఎదగ కూడదా’ అని సూటిగా సంధించిన ప్రశ్న చాలామంది గుండెల్లో గుచ్చుకోవడం ఖాయం. చిత్రసీమ అందరిదీ. కష్టపడేవాడికే ఇక్కడ ఫలితం దక్కుతుంది. కిరణ్ నిజంగానే కష్టపడితే, దానికి తగిన ప్రతిఫలమే అందుకొంటాడు. మధ్యలో ఎవరు ఎంత కిందకు లాగాలని ప్రయత్నించినా, సూటి పోటి మాటలతో వెక్కిరించినా ఉపయోగం ఉండదు.
ఏమీ లేని చిరంజీవి మెగాస్టార్ అవ్వలేదా? ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని రవితేజ, నాని, విశ్వక్సేన్, విజయ్ దేవరకొండ, సిద్దు జొన్నలగడ్డ, అడవిశేష్.. వీళ్లంతా ఇక్కడ ఎదగడం లేదా? ఒక్క చిరంజీవి సక్సెస్… వందలమందిని పరిశ్రమ వైపు అడుగులేసే ధైర్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు కిరణ్‌లాంటి వాళ్లు హిట్లు కొడితే, ఎక్కడో మారుమూల కలలు కంటున్న కుర్రాడికి కొత్త రెక్కలు ఇచ్చినట్టు అవుతుంది. దాన్ని అడ్డుకొనే హక్కు ఎవరికి ఇచ్చారు?
‘ఈ సినిమా ఆడకపోతే… ఎవరికీ నచ్చకపోతే నేను సినిమాలే మానేస్తా’ అని ఛాలెంజ్ విసిరాడు కిరణ్. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ తో చెప్పిన మాట కాదనిపిస్తుంది. తను పడిన కష్టం, ఎదుర్కొన్న అవమానాలు పలికించిన భావాలవి. ‘క’ ఆడినా, ఆడకపోయినా కిరణ్ హీరోగా సక్సెస్ అయ్యాడు. నటుడిగా నిరూపించుకొన్నాడు. ఎక్కడో మారు మూల పల్లెటూరు నుంచి, ఉత్త చేతులతో ఇండస్ట్రీకి వచ్చిన కుర్రాడు ఇప్పుడు వేలమందికి స్ఫూర్తి ఇవ్వడం కంటే, ఆదర్శనంగా నిలవడం కంటే విజయం ఉంటుందా, ఇంతకు మించిన హీరోయిజం కనిపిస్తుందా? కిరణ్ వేదన అర్థం చేసుకోవాల్సిందే. కిరణ్ లాంటి వాళ్ల భుజం తట్టి ప్రోత్సహించాల్సిందే.