ఒక్క హిట్టు చాలు.. కెరీర్ స్పీడందుకోవడానికి. అలాంటి హిట్ కిరణ్ అబ్బవరంకు ‘క’తో దొరికింది. గతేడాది విడుదలైన ఈ చిత్రం విమర్శకుల్ని మెప్పించింది. బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లు రాబట్టుకొంది. ఈ విజయంతో కిరణ్ తన రెమ్యునరేషన్ అమాంతం పెంచేశాడని టాక్. ప్రస్తుతం రూ.5 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నాడట. ‘క’తో కిరణ్‌కు డిజిటల్ మార్కెట్ బాగా పెరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని రూ.5 కోట్లు అడుగుతున్నాడట. తను అడిగింది ఇవ్వడానికి నిర్మాతలు కూడా సిద్ధంగానే ఉన్నారు. ప్రస్తుతం తన చేతిలో 4 ప్రాజెక్టులు ఉన్నాయి. ఎస్.కె.ఎన్, సాయి రాజేష్ బ్యానర్లో ఓ సినిమా చేయబోతున్నాడు కిరణ్. దాంతో పాటు రాజేష్ దండా నిర్మాణంలో మరో సినిమా తెరకెక్కనుంది. ‘క 2’ స్క్రిప్టు కూడా రెడీ అవుతోంది. మరో ఇద్దరు కొత్త దర్శకుల కథలకు ఓకే చెప్పాడు కిరణ్. తను నటించిన `దిల్ రూబా` ఈ ఫిబ్రవరి 14న విడుదల కాబోతోంది.
కిరణ్ దగ్గర ఉన్న మరో ప్లస్ పాయింట్… తన దగ్గర కొన్ని కథలు రెడీగా ఉన్నాయి. కొత్త దర్శకుడు ఏదైనా ఓ మంచి పాయింట్ చెబితే, దాన్ని రైటర్స్ తో డవలెప్ చేసుకొంటుంటాడు. దాంతో కథల విషయంలో కిరణ్‌కు లోటు ఉండడం లేదు. ‘క’ కథ కూడా అలానే డవలెప్ చేయించుకొన్నాడు. ఇప్పుడు మరో రెండు కథలు తన ఆధ్వర్యంలోనే తయారయ్యాయి. ఆ కథని నమ్మి పెట్టుబడి పెట్టే నిర్మాతే దొరకాలి. ప్రమోషన్లు కూడా బాగానే ప్లాన్ చేసుకొంటున్నాడు కిరణ్. ‘క’ విషయంలో ప్రమోషన్లు బాగా హెల్ప్ అయ్యాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొనే నిర్మాతలు కూడా కిరణ్‌ని ఓ మంచి ఆప్షన్‌గా ఫిక్సవుతున్నారు. ‘దిల్ రూబా’ కూడా నిలబడగలిగితే – కిరణ్ బండి హైవే ఎక్కేసినట్టే.