ఈమధ్యకాలంలో వచ్చిన టీజర్, ట్రైలర్లలో అందర్నీ ఆకట్టుకొన్న కంటెంట్ ‘క’`లో కనిపించింది. టైటిల్ దగ్గర్నుంచి, ట్రైలర్ వరకూ ఏదో రూపంలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ వచ్చింది ‘క’. కిరణ్ అబ్బవరం కూడా ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకొన్నాడు. ఓ వైపు హీరోగా నటిస్తూనే, నిర్మాణ బాధ్యతలూ దగ్గరుండి చూసుకొన్నాడు. ప్రమోషన్స్ కూడా తానొక్కడై నడిపిస్తున్నాడు. ఓ వైపు బడ్జెట్ ఎక్కువ అవుతున్నా, కథపై నమ్మకంతో ఖర్చుకు వెనుకాడలేదు. దీపావళికి పోటీ ఎక్కువ ఉన్నా, లాంగ్ వీకెండ్ కోసం రిస్క్ తీసుకొని విడుదల చేస్తున్నాడు. పైగా తమిళంలో థియేటర్లు దొరకలేదు. ఓవారం ఆలస్యంగా అక్కడ రిలీజ్ అవుతోంది. ఈ ఇబ్బందులన్నీ భరిస్తూ రిలీజ్కు రంగం సిద్ధం చేసుకొన్నాడు కిరణ్.
ఈ సినిమాలో చాలా ట్విస్టులున్నాయట. ఇంట్రవెల్ ట్విస్ట్ తో కథ మరో స్థాయికి వెళ్తుందని, ఇంట్రవెల్ తరవాత ప్రతీ పది నిమిషాలకూ ఓ ట్విస్ట్ రివీల్ అవుతుందని, క్లైమాక్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. జాతర సెటప్, అక్కడ వచ్చే పాట ఇవన్నీ ప్లస్ పాయింట్స్ గా మారతాయని చిత్రబృందం నమ్మకంగా చెబుతోంది. కిరణ్ కూడా కంటెంట్ పై ముందు నుంచీ నమ్మకంగా ఉన్నాడు. ‘ఇలాంటి కంటెంట్ తో ఇప్పటి వరకూ సినిమా రాలేదు. వచ్చిందని నిరూపిస్తే నేను సినిమాలు మానుకొంటా’ అని ధైర్యంగా స్టేట్ మెంట్ ఇవ్వడానికి కారణం ఇదే. బుధవారం నుంచే ‘క’ ప్రీమియర్లు పడబోతున్నాయి. ఒక రోజు ముందే షో వేయడం ఈరోజుల్లో చాలా రిస్కీ. కిరణ్ అందుకు కూడా సిద్ధపడ్డాడు. మరి ఈ కష్టానికి, మొండి ధైర్యానికి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.