‘క’ సినిమా ప్రమోషన్స్ లో కిరణ్ అబ్బవరం తనపై వచ్చే ట్రోలింగ్స్ పై ఓపెన్ గానే మాట్లాడారు. ఎలాంటి ఇండస్ట్రీ నేపధ్యం లేకుండా ఎదుగుతున్న తనని ఎందుకింత ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ట్రోలర్స్ కి ‘క’సినిమాతో సమాధానం చెబుతానని చెప్పి, నిజంగానే ఆ సినిమాతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. కిరణ్ కెరీర్ లో ‘క’ సినిమా చాలా ప్రత్యేకంగా నిలిచింది.
ఇప్పుడు దిల్ రుబా వంతు వచ్చింది. ఈ సినిమా చూసిన కొందరు కిరణ్ పై మళ్ళీ ట్రోలింగ్ మొదలుపెట్టారు. నిజానికి వీక్ కంటెంట్ తో తయారైన సినిమా ఇది. పైగా హీరో క్యారెక్టరైజేషన్ లో నిలకడ లేదు. ఒక ప్రేమకథలో అనవసరమైన మాస్ ఎలివేషన్స్ ఇచ్చి కంగాళీ చేశారు. `దిల్ రూబా`లో కాలేజీ సీన్లు, లవ్ మూమెంట్స్ అన్నీ ఓకే అనిపిస్తాయి. కానీ మాస్, యాక్షన్ ఎపిసోడ్లతోనే ఇబ్బంది. ఫైట్లు, పాటలు, డైలాగులు అన్నీ నాన్ సింక్ గా తయారైయ్యాయి. దీంతో మళ్ళీ ట్రోలర్స్ కి ఆయుధం దొరికినట్లయింది.
నిజానికి ‘క’ సినిమాకి ముందు కిరణ్ చేసిన దాదాపు సినిమాలు మాస్ మంత్రం జంపించేవే. హీరో ఇమేజ్ కి, చేస్తున్న క్యారెక్టర్ సంబంధం లేకుండా సాగేవే. ‘క’ మాత్రం కథ, కాన్సెప్ట్ ని నమ్మి చేసిన సినిమా. ఎక్కడ కూడా అనవసరమైన ఎలివేషన్ లేకుండా సాగిన ఈ సినిమా ఆడియన్స్ మెప్పించింది. కిరణ్ పడ్డ కష్టానికి ఫలితం దక్కింది.
దిల్ రుబా కి వచ్చేసరికి మళ్ళీ అదే నాన్ సింక్ మాస్ వైఖరి కనిపించింది. యధావిధిగా మళ్ళీ ట్రోలింగ్ మొదలైయింది. నిజానికి ఇది ‘క’ సినిమాకి ముందు ఒప్పుకున్నదే కావచ్చు. అయితే ఈ రెండు సినిమాలని బేరీజు వేసుకుంటే.. తనపై జరుగుతున్న ట్రోలింగ్ మెయిన్ రీజన్ కిరణ్ కే అర్ధమైపోతుంది.
కిరణ్ మాస్ సినిమాలు చేయడానికి ఇంకా సమయం ఉంది. ఇప్పుడు తన ఇమేజ్‌కీ, వయసుకు తగ్గట్టు యూత్ ఫుల్ లవ్ స్టోరీలు చేయాలి. కిరణ్ ఇప్పుడు కేస్తున్న ‘కే ర్యాంప్’ అలాంటి కథే. ఇది పూర్తిగా యూత్ ఫుల్ సబ్జెక్ట్. కుర్రాళ్లకు నచ్చేలా ఈ స్క్రిప్టుని తీర్చిదిద్దారు. సాయి రాజేష్ డైరెక్షన్ లోనూ కిరణ్ ఓ సినిమా చేస్తున్నాడు. అది కూడా లవ్ స్టోరీనే. కాబట్టి ఈ రెండు సినిమాలతో కిరణ్ కమ్ బ్యాక్ ఇస్తాడని అతని టీమ్ ఆశిస్తోంది.