ఓ దర్శకుడు కథ రాసుకొంటే, ఆ కథ ఏ హీరోకి సూట్ అయితే.. ఆ హీరో దగ్గరకు కథనీ, దర్శకుడ్నీ తీసుకెళ్లడం నిర్మాత పని. సాధారణంగా సినిమాల ప్రోసెస్ అలానే ఉంటుంది. అయితే ఓ కుర్ర హీరో మాత్రం నాకు కథలు అక్కర్లేదు.. దర్శకుడితో వస్తే చాలు అని నిర్మాతలకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడట. ఆ కుర్ర హీరో… కిరణ్ అబ్బవరం.
రాజావారు, రాణీగారుతో ఆకట్టుకొన్న కిరణ్.. ఎస్.ఆర్. కల్యాణమండపంతో హిట్టు కొట్టాడు.ఆ తరవాత గంపెడు అవకాశాలు కిరణ్ ని వెదుక్కుంటూ వెళ్తున్నాయి. ఈమధ్య కొన్ని ఫ్లాపులు తారసపడ్డా…. నిర్మాతల తాకిడి మాత్రం తగ్గడం లేదు. అయితే.. కిరణ్కి కథలు అక్కర్లేదట. తన దగ్గరే బోలెడన్ని కథలు ఉన్నాయట. వాటితో సినిమాలు తీసుకొంటానని నిర్మాతలకు చెబుతున్నాడట. కిరణ్ లో ఈ టాలెంట్ కూడా ఉంది. ఎస్.ఆర్. కల్యాణమండపం స్క్రిప్టులో తన హ్యాండు బలంగా ఉంది. ఆ సినిమా హిట్టయ్యింది కదా? అందుకనే ఓ టీమ్ ని పెట్టుకొని వాళ్లతో కథలు రెడీ చేయిస్తున్నాడట. అందుకే ఎవరైనా కథ చెబుతానంటే.. `నా దగ్గరే బోలెడు కథలున్నాయి.. దర్శకుడు ఇస్తే చాలు` అంటున్నాడట. కిరణ్ రాసుకొన్న కథలు బాగుంటే ఫర్వాలేదు. లేదంటే దర్శకుడు `లాక్` అయిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే కిరణ్ బుర్రలోంచి వచ్చిన ఆలోచన గనుక… ఆయన చెప్పిందే ఫాలో అయిపోవాలి. ఇక్కడ దర్శకుడి క్రియేటివిటీకి ఛాన్స్ లేదు. హిట్ కొడితే మాత్రం.. ఆ క్రెడిట్ డైరెక్టర్ ఖాతాలోకి వెళ్తుంది. ఈ రిస్క్ తీసుకొంటేనే సినిమా. లేదంటే లేనట్టే. మరి.. కిరణ్ అబ్బవరం కథలకు `ఊ`కొట్టేదెవరో చూడాలి.