అర్జున్ రెడ్డి తరవాత యాంగర్ మేనేజ్మెంట్ తెలియని హీరోల కథలు వెండి తెరపైకి రావడం ఎక్కువైంది. హీరోయిజం బలంగా పండడానికి కోపాన్ని ఆయుధంగా వాడుకొంటున్నారు. ఈ జాబితాలో చేరే కథలా అనిపిస్తోంది… `దిల్ రూబా`. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న సినిమా ఇది. `క` తరవాత కిరణ్ నుంచి వస్తున్న ప్రాజెక్ట్ కాబట్టి అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. 2025 ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. కొంత మేర ప్యాచ్ వర్క్ జరుగుతోంది. సంక్రాంతి తరవాత ప్రమోషన్లు మొదలు పెట్టి, ఫిబ్రవరి రెండోవారంలో విడుదల చేయాలన్నది ప్లాన్. సరిగమ కంపెనీ ఈ చిత్రంతో నిర్మాణ రంగంలోనూ అడుగుపెట్టింది. విశ్వకరుణ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
`హిజ్ యాంగర్.. హిజ్ లవ్` అనేది ఉపశీర్షిక. దీన్ని బట్టి… `అర్జున్ రెడ్డి` తరహాలోనే ఓ కోపిస్టి ప్రేమికుడి కథ ఇదని అర్థం అవుతోంది. కిరణ్ లుక్‌ని పూర్తిగా రివీల్ చేయలేదు కానీ, తనది మాస్ క్యారెక్టర్ అని అర్ధమవుతోంది. `క` తరవాత కిరణ్‌కి చాలా అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల ఓ కథని కూడా ఓకే చేశాడు. హాస్య మూవీస్ బ్యానర్ పై, రాజేష్ దండా నిర్మించే చిత్రంలో కిరణ్ నటిస్తున్నాడు. కథ ఓకే అయ్యింది. ఈ సినిమాతో నాని అనే ఓ కొత్త కుర్రాడ్ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. `దిల్ రూబా` విడుదలైన వెంటనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కిస్తారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.