మాజీ ఐ.పి.ఎస్.అధికారి కిరణ్ బేడిని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమింపబడ్డారు. నిన్న సాయంత్రమే రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యేయి. ఆమె రెండు మూడు రోజుల్లో బాధ్యతలు చేపడతారని సమాచారం.
భాజపాలో చేరిన ఏడాది వ్యవధిలోనే ఆమెకు అటువంటి అత్యున్నతమైన పదవి కట్టబెట్టడం విశేషమే. 2015లో జరిగిన డిల్లీ శాసనసభ ఎన్నికలలో అరవింద్ కేజ్రీవాల్ ని ఎదుర్కొని నిలవాలంటే అంత మంచి పేరున్న కిరణ్ బేడి తప్ప మరొకరి వల్ల సాధ్యంకాదనే అభిప్రాయంతోనే ఆమెను భాజపాలోకి ఆహ్వానించి, ముఖ్యమంత్రి అభ్యర్ధిగా నిలబెట్టారు. అరవింద్ కేజ్రీవాల్ కి ఆమె గట్టి పోటీ ఇచ్చారు కానీ ఓడిపోయారు. ఒకవేళ గెలిచి ఉండి ఉంటే ప్రస్తుతం ఆమె డిల్లీ ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆమె డిల్లీకి ముఖ్యమంత్రి కాలేకపోయినా ఇప్పుడు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కాగలిగారు. డిల్లీ ఎన్నికలకు వరకు రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆమెను భాజపా అధిష్టానమే ఏరికోరి ప్రత్యక్ష రాజకీయాలలోకి రప్పించినందున, పార్టీ కోసం పోరాడినందుకు ఆమెకు ఈ పదవి కట్టబెట్టి ఉండవచ్చు.
పుదుచ్చేరి గవర్నర్ పదవి గత రెండేళ్ళుగా ఖాళీగా ఉంది. అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ పుదుచ్చేరిని కూడా చూస్తున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ గా నియామకం జరిగిన తరువాత కిరణ్ బేడి మీడియాతో మాట్లాడుతూ, “గవర్నర్ పదవిని నేను అధికారంగా కాక ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశంగా భావిస్తాను. ఈ పదవితో సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజలకు కూడా సేవ చేసేందుకు ప్రయత్నిస్తాను. ఒక సామాన్య స్కూల్ టీచర్ లేదా ఒక పోలీస్ కానిస్టేబుల్ వంటి వాళ్ళు కూడా సమాజంలో అతిముఖ్యమైన వాళ్ళని భావించేవిధంగా నేను పనిచేస్తాను. నాపై నమ్మకం ఉంచి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి నా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. ఆయన నాపి ఉంచిన ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొంటాను,” అని కిరణ్ బేడి అన్నారు.
ఇటీవల జరిగిన పుదుచ్చేరి శాసనసభ ఎన్నికలలో భాజపా ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. శాసనసభలో మొత్తం 30 సీట్లు ఉంటే వాటిలో కాంగ్రెస్, డిఎంకె కూటమి 17 సీట్లు గెలుచుకోగా, అన్నాడిఎంకె-4, మిగిలినవి ఇతరులు గెలుచుకొన్నారు. కనుక పుదుచ్చేరిలో కాంగ్రెస్, డిఎంకె కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయి. నియమనిబంధనలను చాలా ఖచ్చితం పాటించి, అమలుచేసే అలవాటున్న కిరణ్ బేడిని పుదుచ్చేరి గవర్నర్ గా నియమించడంతో ఆ రెండు పార్టీలకి పరిపాలన కత్తిమీద సాములాగే సాగుతుందేమో?