పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుండి కిరణ్ బేడిని తొలగిస్తున్నట్టు గా రాష్ట్రపతి ఈరోజు ఆదేశాలు జారీ చేశారు. శాశ్వత ప్రాతిపదిక మరొక లెఫ్టినెంట్ గవర్నర్ ని ప్రకటించే వరకు తెలంగాణ గవర్నర్గా ఉన్న తమిళ సై కు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. వివరాల్లోకి వెళితే..
కిరణ్ బేడీ నేపథ్యం:
మొదటి మహిళా ఐపీఎస్ ఆఫీసర్ గా 1972 లో నియమింపబడ్డ కిరణ్ బేడీ దాదాపు 35 సంవత్సరాలు అధికారిగా బాధ్యతలు నిర్వహించారు. ఉద్యోగ బాధ్యతల తో పాటు అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించి, మెగసెసే సహా అనేక అవార్డులు గెలుచుకున్నారు. రిటైర్మెంట్ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత అరవింద్ కేజ్రివాల్ తో విభేదించి మోడీకి మద్దతు పలికారు. బిజెపి తరఫున ఢిల్లీకి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే అక్కడ ఓడిపోయారు. మోడీ ప్రభుత్వం 2016 లో కిరణ్ బేడీ ని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమించింది. అయితే ఈ రోజు అదే ప్రభుత్వం ఆవిడ పదవీకాలం కొద్ది నెలల్లో ముగియనుండగా ఆ పదవి నుంచి ఉద్వాసన పలికింది.
రాజీనామా అడగకుండా ఉద్వాసన పై విస్మయం :
తమిళనాడు ఎన్నికలతో పాటు త్వరలోనే పుదుచ్చేరికి కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రెండు మూడు నెలల్లో ఎన్నికలు ఉండగా, ఇప్పుడు హఠాత్తుగా లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుండి కిరణ్ బేడి ని తొలగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడం సంచలనం సృష్టించింది. నిజానికి ఉత్తర్వులు రాష్ట్రపతి జారీ చేసినప్పటికీ ఆ ఆదేశాలు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకే ఉంటాయన్న విషయం తెలిసిందే.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 155 ఒక రాష్ట్ర గవర్నర్ను భారత రాష్ట్రపతి నియమిస్తారు. అయితే ఆర్టికల్ 156 (1) ప్రకారం, రాష్ట్రపతి ఎప్పుడు కావాలంటే అప్పుడు గవర్నర్ ను ఆ పదవి నుండి తొలగించి వచ్చు. ఇక్కడ రాష్ట్రపతి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అన్న పదానికి అర్థం కేంద్ర ప్రభుత్వం తలుచుకున్నప్పుడు అని. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి సంతృప్తి గా ఉన్నట్లయితే గవర్నర్ పదవి కాలం పూర్తి ఐదేళ్లు కొనసాగవచ్చు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం గవర్నర్ లేదా లెఫ్టినెంట్ గవర్నర్ ను తీసివేయాలి అనుకున్నప్పుడు వారు తమకు తాము రాజీనామా చేసే లాగా ఒక అవకాశాన్ని ఇస్తారు. రాజీనామా చేయమని అంతర్గతంగా కోరుతారు. అయితే ఈ సంప్రదాయాన్ని పక్కనపెట్టి మోడీ ప్రభుత్వం రాష్ట్రపతి ద్వారా కిరణ్ బేడి ని పదవి నుండి ఎందుకు ఉద్వాసన పలకాల్సి వచ్చింది అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ కిరణ్ బేడీ ని రాజీనామా చేయమని అంతర్గతంగా కోరినప్పటికీ ఆమె అందుకు ఒప్పుకోలేదా అన్న విషయం తెలియాల్సి ఉంది.
ఇంతకీ ఉద్వాసన ఎందుకు ?
మరో రెండు మూడు నెలల్లో పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అయితే గత కొంత కాలంగా పుదుచ్చేరి రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నారాయణస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే నారాయణ స్వామికి కిరణ్ బేడీ కిఎంతో కాలంగా ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతోంది. కిరణ్ బేడీ పలు పాలన వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని ఆయన బహిరంగంగానే చాలాసార్లు మండిపడ్డారు. కిరణ్ బేడీ ని లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నారు.
అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి చేసిన డిమాండ్ కారణంగానే బిజెపికి చెందిన కేంద్ర ప్రభుత్వం కిరణ్ బేడీ కి ఉద్వాసన పలికింది అని అనుకుంటే పొరపాటే. ఇటీవలి కాలంలో దాదాపు పది మంది దాకా పుదుచ్చేరి లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. వీరిలో చాలామంది బిజెపి లోకి రావడానికి సన్నద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఎమ్మెల్యేల లో కూడా చాలామంది కిరణ్ బేడి వ్యవహారశైలిపై ఫిర్యాదు చేసినట్లు, తాము అసెంబ్లీ ఎన్నికల సమయానికి బిజెపిలోకి చేరాలంటే కిరణ్ బేడీ ని లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుండి తొలగించాలని బిజెపి కి షరతు విధించినట్లు తెలుస్తోంది. కేవలం ఈ ఒక్క కారణంతో తోనే కేంద్ర ప్రభుత్వం కిరణ్ బేడీ ని సాగనంపాలని నిర్ణయించుకున్నట్లు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది.
ఏది ఏమైనా, పోలీస్ ఆఫీసర్ గా ఎంతోమందిని ఇన్స్పైర్ చేసిన కిరణ్ బేడీ గవర్నర్ గా కూడా తనదైన శైలిలో రాణించింది. ఉద్వాసన పై ఆవిడ ఏ విధంగా స్పందిస్తుంది అన్నది వేచి చూడాలి.
– Zuran