ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లోకి వస్తారా అనే చర్చ ఈ మధ్య జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎందుకంటే, ఏపీలో పార్టీ బలోపేతంపై ఏఐసీసీ ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. ఏపీలో పార్టీని వీడిన వారిని వెనక్కి రప్పించాలని ప్రయత్నిస్తున్నారు. దీన్లో భాగంగా ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేకుండా తటస్థంగా ఉంటున్న కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలోకి పిలవాలని నిర్ణయించారు. ఆదివారం నాడు కిరణ్ తో రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఉమెన్ చాందీ భేటీ అయ్యారు. దాదాపు గంటసేపు ఈ ఇద్దరు నేతలూ చర్చించుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఉమెన్ చాందీ… దేశంలో కాంగ్రెస్ నేతలంతా ఒక్కటి కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామిక శక్తులను ఏకం చేసేందుకు అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఏపీలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా, గతంలో పార్టీకి సేవలందించిన నేతల్ని మళ్లీ పిలుస్తున్నామన్నారు. అదే క్రమంలో కిరణ్ కుమార్ రెడ్డిని కలిశామనీ, పార్టీలోకి ఆహ్వానించామన్నారు. అయితే, వస్తారా లేదా అనేది ఆయన ప్రకటించాల్సిన నిర్ణయం అవుతుందని ఉమెన్ చాందీ చెప్పారు. ఇక, ఈ భేటీపై స్పందించేందుకు కిరణ్ కుమార్ రెడ్డి ఆసక్తి చూపలేదు. కాంగ్రెస్ లోకి వస్తారని వార్తలు వస్తున్నాయి కదా మీ స్పందన ఏంటని పదేపదే విలేకరులు అడిగినా.. ‘వార్తలే కదా, సమయం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడతాను’ అని చెప్పి నవ్వేశారు. ఉమెన్ చాందీ ఆహ్వానంపై ఆలోచిస్తాననిగానీ, పరిశీలిస్తాననిగానీ చెప్పలేదు.
నిజానికి, గత వారంలోనే పల్లంరాజు, సుబ్బరామిరెడ్డి లాంటి ఇతర కాంగ్రెస్ ప్రముఖులు కూడా కిరణ్ తో భేటీ అయ్యారు. వారు కూడా కిరణ్ ను ఆహ్వానించారు. ఇప్పుడు చివరిగా ఉమెన్ చాందీ కూడా వచ్చారు. అయితే, కిరణ్ పార్టీలోకి మళ్లీ వచ్చేందుకు సుముఖంగానే ఉన్నారనీ, ఈ వారంతంలోగా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందనీ, రాహుల్ గాంధీని కలిసి.. అక్కడే అధికారికంగా ఆయన పార్టీలోకి పునరాగమన ప్రకటన ఉంటుందనే అభిప్రాయమూ వ్యక్తమౌతోంది. ఏదేమైనా, కిరణ్ కుమార్ విషయంలో కాంగ్రెస్ పట్టుదలగానే ఉంది. ఆయన్ని పార్టీలోకి తీసుకుని రావాలని తీవ్రంగానే ప్రయత్నిస్తోంది. మరి, ప్రస్తుతం కిరణ్ కుమార్ సోదరుడు ప్రస్తుతం టీడీపీ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కిరణ్ నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.