ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ఆఖరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరిపోయారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పచ్చ కండువా కప్పేసుకున్నారు. అయితే, తన అన్నయ్య కిరణ్ కుమార్ కి ఈ చేరిక ఇష్టమా కాదా అనేదానిపై రకరకాల కథనాలు వస్తున్నాయి. తమ్ముడు టీడీపీలో చేరడంపై ఆయనకు ఇష్టం లేదంటూ మీడియాలో కొన్ని కథనాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు, తన ఇంట్లో జరిగే కుటుంబ కార్యక్రమాలకు కూడా తమ్ముడిని ఇకపై పిలవకూడదని ఆయన నిర్ణయించుకున్నట్టు కూడా ఓ ప్రముఖ మీడియా సంస్థ కథనం రాసేసింది! అయితే, వాస్తవంలో అలాంటి పరిస్థితి ఉంటుందా..? టీడీపీలో తమ్ముడి చేరికను కిరణ్ కుమార్ రెడ్డి అంత తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉందా..? అంటే, లేదనే చెప్పాలి.
నిజానికి, కిరణ్ కుమార్ రెడ్డి చిన్నప్పట్నుంచీ ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉండేవారు. రాష్ట్ర స్థాయి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నా, క్షేత్రస్థాయిలో పనులన్నీ తమ్ముడు కిషోర్ చక్కబెడుతూ వచ్చారు. నియోజక వర్గంలో ఆయనే యాక్టివ్ గా ఉంటారు. రాష్ట్ర విభజన తరువాత కిరణ్ కుమార్ రెడ్డి పొలిటికల్ కెరీర్ కు ఓరకంగా బ్రేక్ పడిందనే చెప్పాలి. గత ఎన్నికల సమయంలో సొంతంగా ఒక పార్టీ పెట్టినా, ఆశించిన స్థాయిలో దానికి గుర్తింపు రాలేదు. ఆ తరువాత, ఆయన సైలెంట్ గానే ఉండిపోయారు. గడచిన కొన్ని నెలలుగా ఆయన పార్టీ మార్పుపై కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి. తెలుగుదేశంలో చేరతారనే ప్రచారం చాలారోజులుగా వినిపిస్తున్నదే. వాస్తవం మాట్లాడుకుంటే.. ఆయన ఏ పార్టీలోనూ చేరే అవకాశం ప్రస్తుతానికి కనిపించడం లేదు.
ఎందుకంటే, కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర స్థాయి నాయుకుడు. ఏ పార్టీలో చేరినా ఆ స్థాయి గుర్తింపు ఆయన ఆశిస్తారు. ఆయనకున్న రెండు ఆప్షన్లు.. వైకాపా, టీడీపీ! వైకాపాలోకి వెళ్లరనేది సుస్పష్టం. ఇక, టీడీపీలో కిరణ్ చేరినా.. రాష్ట్ర స్థాయి నాయకుడి గుర్తింపు ఆయనకు టీడీపీ అధినాయకత్వం కట్టబెడుతుందనే నమ్మకం లేదు. పోనీ, సొంతగూడు కాంగ్రెస్ కు వచ్చి, క్రియాశీలం అవుదాం అనుకున్నా… ఆంధ్రాలో ఆ పార్టీ ఇంకా చతికిలపడే ఉంది. కోలుకునే వాతావరణం దరిదాపుల్లో కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన తమ్ముడు టీడీపీలో చేరారు. కిరణ్ కుమార్ అనుమతి లేకుండా ఆయన పార్టీని వీడే పరిస్థితి ఉండదు కదా! అయితే, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా టీడీపీలోకి వచ్చేస్తారా అనే చర్చ మళ్లీ తెరమీదికి వస్తుంది. ప్రస్తుతానికైతే ఆయన ఏపార్టీలోనూ చేరేందుకు సిద్ధంగా లేరనే సంకేతాలే వ్యక్తమౌతున్నాయి. టీడీపీ కూడా ఆయన్ని పనిగట్టుకుని ఆహ్వానించే పరిస్థితీ లేదు. ఎందుకంటే, క్షేత్రస్థాయిలో కిషోర్ కుమార్ రెడ్డి క్రియాశీలంగా ఉంటారు. పార్టీపరంగా టీడీపీ అవసరం అంతే! సో.. ఎలా చూసుకున్నా.. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏ పార్టీవైపూ వెళ్లే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదనే అనిపిస్తోంది.