మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం లాంఛనం మాత్రమే! ఇప్పటికే ఆయన ఢిల్లీ చేరుకున్నారు. శుక్రవారం నాడు అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు! ఆయన్ని కాంగ్రెస్ లోకి తీసుకుని రావడం ద్వారా రాష్ట్రంలో ఇతర నేతల్ని కూడా ఆర్షించొచ్చు, పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చే ప్రక్రియను ప్రారంభించొచ్చు అనేది హైకమాండ్ ఆలోచన. అయితే, ప్రస్తుతం పార్టీలో చేరుతున్న కిరణ్ కు అప్పగించే బాధ్యతలు, పార్టీ నుంచి ఆయన ఆశిస్తున్న ప్రాధాన్యత ఏంటనేదే ఇప్పుడు కీలకాంశం. ఎందుకంటే, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు ఆయన. ఏరికోరి వెంటపడి మరీ ఆయన్ని పార్టీలోకి తీసుకొస్తున్నప్పుడు ప్రాధాన్యత అంటూ ఉండాలి కదా!
అయితే, కిరణ్ మనసులో మాట ఏంటంటే… ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని అనుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం! ఈ మాటను ఇప్పటికే పార్టీ హైకమాండ్ కు కిరణ్ చెప్పారనీ, అక్కడి నుంచి కూడా సానుకూల స్పందనే వచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో గానీ, పార్టీ జనరల్ సెక్రటరీ వంటి కీలకమైన స్థానంలో ఆయనకి అవకాశం కల్పించే సూచనలున్నట్టు సమాచారం. పార్టీలోకి రాగానే ఆయనకంటూ ప్రాధాన్యత కల్పించడం ద్వారా, ఎన్నికల నాటికి ఆయన్ని రాష్ట్రస్థాయిలో మరింత కీలకం చేయాలని హైకమాండ్ భావిస్తున్నట్టు సమాచారం. అయితే, రాష్ట్ర అవసరాల దృష్ట్యా కాంగ్రెస్ లో ఇప్పటికిప్పుడే ఆయన కీలక పాత్ర పోషించాల్సిన అత్యవసరం ఉంది. కానీ, కాంగ్రెస్ కు కిరణ్ అవసరం కాబట్టి.. ఆయన డిమాండ్లకు తలొగ్గాల్సిన పరిస్థితిలో పార్టీ ఉందనేది వాస్తవం.
తక్షణమే రాష్ట్ర రాజకీయాలను నెత్తినేసుకునే పరిస్థితిలో కిరణ్ కుమార్ రెడ్డి లేరనే అభిప్రాయం ఏఐసీసీ వర్గాల నుంచే వినిపిస్తూ ఉండటం గమనార్హం! ఏపీ కాంగ్రెస్ లోకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్న నేతలు ఎంతమంది అనేది కూడా ఇప్పుడు పెద్ద ప్రశ్నగా ఉంది! ఇది కిరణ్ కుమార్ రెడ్డి అంచనా వేయలేని పరిస్థితేం కాదు. అందుకే, కొన్నాళ్లపాటు వేచి చూడటం ద్వారా.. ఎన్నికల నాటి పరిస్థితులపై ఒక అంచనాకి రావడం, పార్టీలో తానేం చెయ్యగలనే పాత్రపై స్పష్టత తెచ్చుకోవాలనే వ్యూహాంతోనే ఆయన ఉన్నట్టు భావించొచ్చు. ఏదేమైనా, కిరణ్ చేరికతో ఏపీ కాంగ్రెస్ లో కొంత కదలిక మొదలైనట్టే అని చెప్పాలి. ఇక, గతంలో రాహుల్ గాంధీ చెప్పినట్టుగా… ఏపీలో జగన్ ను టార్గెట్ చేసుకుని పనిచేస్తేనే కాంగ్రెస్ ఓటు బ్యాంకు వెనక్కి వచ్చే అవకాశాలున్నాయన్నది వాస్తవం. ఈ లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ ప్రయాణం ఎలా ఉంటుందో వేచి చూడాలి.