కాంగ్రెస్ హైకమాండ్ ఏపీ కోసం ..ప్రత్యేక కమిటీని ప్రకటించింది. గిడుగు రుద్రరాజు కొత్త పీసీసీ చీఫ్ అయ్యారు. ఇప్పటి వరకూ సాకే శైలజానాథ్ ఉన్నారు. ఆయన పదవీ కాలం ముగియడంతో కొత్త కమిటీని నియమించారు. గిడుగు రుద్రరాజు పీసీసీ చీఫ్ కాగా.. నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉన్నారు. మస్తాన్ వలీ, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, రాకేశ్ రెడ్డిలు ఈ బాధ్యతలు తీసుకుంటారు. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ గా పళ్లం రాజు, ప్రచార కమిటీ చైర్మన్‌గా జీవీ హర్షకుమార్, మీడియా, సోషల్ మీడియా కమిటీ చైర్మన్‌గా తులసి రెడ్డిని నియమించారు. అలాగే పొలిటికల్ అఫైర్స్ కమిటీని , 18మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ, 33 మందితో కోఆర్డినేషన్ కమిటీని నియమించారు.
అయితే ఎక్కడో చోట కేవీపీ రామచంద్రరావు, సుబ్బరామిరెడ్డి, పళ్లంరాజు వంటి పార్టీనే అంటి పెట్టుకుని ఉన్న సీనియర్ల పేర్లు వినిపించాయి కానీ.. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు మాత్రం ఎక్కడా లేదు. ఆయన మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. జాతీయస్థాయిలోనూ ఆయన కాంగ్రెస్‌కు ఏమైనా కంట్రిబ్యూట్ చేస్తున్నారో స్పష్టత లేదు. రాహుల్ గాంధీ పాదయాత్ర ఏపీకి వచ్చినప్పుడు కూడా ఆయన పట్టించుకోలేదు. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నారన్న పేరే తప్ప.. ఆ పార్టీ బలోపేతానికి పని చేసే ఉద్దేశంలో లేరని క్లారిటీ వచ్చేసినట్లయింది.
జగన్ పార్టీ పెట్టుకున్న తర్వాత ఓటు బ్యాంక్.. నేతలు అంతా.. ఆ పార్టీ వైపు వెళ్లిపోయారు. కాంగ్రెస్‌ను అంటి పెట్టుకుని ఉన్న కొంత మంది జనాకర్షణ లేని నాయకులు. అందుకే ఆ పార్టీ గట్టిగా పోరాటాలు కూడా చేయలేక సతమతమవుతోంది. ప్రెస్ మీట్లకే పరిమితమవుతోంది. తులసీరెడ్డి మాత్రం ప్రతీ రోజూ ఏదో అంశంపై పాలపక్షంపై విమర్శలు గుప్పిస్తూంటారు. సుంకర పద్మశ్రీ కొన్ని కార్యక్రమాలు చేపడతారు. మిగిలిన వారుఎప్పుడూ కనిపించారు. కొత్త కమిటీ అయినా యాక్టివ్‌గా పని చేస్తుందని చెప్పడం కష్టం. ఏపీ పై కాంగ్రెస్ హైకమాండ్‌కు కనీస ఆశలు లేవని తాజా పీసీసీ ప్రకటనతో తేలిపోయిందంటున్నారు.