సోదరుడు కిషోర్ కుమర్ రెడ్డి టీడీపీలో చేరాడని కిరణ్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లడం మానేశారట. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. ‘మాది ఉమ్మడి కుటుంబం. మా సోదరుడు టీడీపీలో చేరిన తరువాత ఇంటికి కూడా వెళ్లలేదు. గెస్ట్ హౌస్ లో ఉంటున్నాను. ప్రస్తుతం ఇల్లు కట్టుకుంటున్నా’ అని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. బీజేపీలో చేరిన అనంతరం ఢిల్లీ నుంచి ఏపీకి వచ్చారు . అక్కడ మీడియాతో మాట్లాడుతూ తన సోదరుడు టీడీపీలో ఉండటంపై స్పందించారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో అభివృద్ధి జరుగుతోందన్నారు. తాను కేవలం బీజేపీలో ప్రాథమిక సభ్యత్వం ఆశించి మాత్రమే పార్టీలో చేరానని, పదవులు ఆశించి కాదన్నారు. బీజేపీ నుంచి ఓ ముఖ్య నేత తనను సంప్రదించారని, ఆ తర్వాత బీజేపీలో చేరానని తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణపైనా మాట్లాడారు. ఎయిరిండియా తరహాలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సెంటిమెంట్ ఉంది కనుక విశాఖ స్టీల్ ప్లాంట్ ను నిలబెట్టుకునే ప్రయత్నం జరుగుతుందన్నారు. కానీ లాభాల్లోకి రావాలి. బిడ్డింగ్ వేస్తే ఎవరైనా ఆసక్తి చూపిస్తారని చెప్పారు.
తాను హైదరాబాద్లోనే పుట్టి, అక్కడే పెరిగి, హెచ్పీఎస్, నిజాం కాలేజీల్లో చదువుకున్నానని, సొంత ఊరు ఏపీలోని చిత్తూరు అన్నారు. తనకు బెంగళూరులో కూడా ఇల్లు ఉందని అన్నారు. అలాంటప్పుడు పార్టీ అవసరాన్ని బట్టి, ఎక్కడ పని చేయమంటే అక్కడ పని చేస్తానని చెప్పారు. మొదట తాను భారతీయుడినని, తరువాతే ఏపీ, హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వాడినన్నారు. పార్టీ ఎక్కడ పనిచేయమంటే అక్కడ బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. పార్టీ తనకు అప్పగించే బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తిస్తాను. పనులు చేస్తూ పోతే పదవులు అవే వస్తాయన్నారు కిరణ్ కుమార్ రెడ్డి.