హైదరాబాద్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వివాదం ఏదయినా ఉంది ఉంటే అది ఆమిర్ ఖాన్ వ్యాఖ్యల వివాదమే. అయితే ఆ వివాదానికి మూలకారణమైన కిరణ్ రావు తెలుగమ్మాయేనని, తెలంగాణ అమ్మాయన్న విషయం తాజాగా వెలుగులోకొచ్చింది. కిరణ్ రావుది మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి. నిజాంకు సమాంతరంగా హిందూ రాజ్యాన్ని పాలించిన వనపర్తి సంస్థానం రాజవంశీకుడు రాజా రామేశ్వర్ రావుకు కిరణ్ రావు మనవరాలు వరస అవుతారు. రామేశ్వరరావు భార్య శాంతా రామేశ్వరరావు తమ్ముడు సీఎంఎస్ రావుకు మనవరాలని వనపర్తిలోని సంస్థానం సిబ్బంది చెబుతున్నారు. కిరణ్ తండ్రి అప్పట్లోనే ఇంజనీరింగ్ చదివి ఉద్యోగరీత్యా బెంగళూరు, కొల్ కతా, ముంబాయి నగరాలలో ఉన్నారు. ఈ క్రమంలో కిరణ్ విద్యాభ్యాసం కూడా ఆయా నగరాలలో జరిగింది. కొల్‌కతాలోని లొరెటో హౌస్‌లో ప్రాథమిక విద్య పూర్తి చేసి ఎకనామిక్స్ డిగ్రీని ముంబైలోని సోఫియా కళాశాలనుంచి తీసుకున్నారు. మాస్ కమ్యూనికేషన్స్ మాస్టర్స్ డిగ్రీని ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీనుంచి పొందారు. సినీరంగంపై ఉన్న ఆసక్తితో లగాన్ దర్శకుడు ఆశుతోష్ గోవారికర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరారు. లగాన్ సమయంలోనే ఆమిర్‌తో పరిచయం ఏర్పడింది. 2002లో ఆమిర్ తన మొదటి భార్య రీనా దత్తాకు విడాకులిచ్చి కిరణ్ రావును పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఆజాద్ అనే బాబు ఉన్నాడు. ఈ పిల్లవాడిని సర్రోగసి విధానంలో ఆమిర్ దంపతులు కన్నారు. కిరణ్‌కు ప్రస్తుతం 42 ఏళ్ళు. ఆమె దోబీఘాట్ చిత్రానికి దర్శకత్వం వహించారు. కిరణ్ తల్లిదండ్రులు రావు, ఉమ ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నారు.