తిరుపతి జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్.. లక్ష్మి అనే మహిళతో రాజీ చేసుకున్నారు. ఇద్దరూ ఒకరిపై ఒకరు పెట్టుకున్న కేసుల్ని ఉపసంహరించుకున్నారు. లక్ష్మి అనే మహిళతో ఏర్పడిన వివాదం కారణంగా ఆయన జనసేన పార్టీ వ్యవహారాల్లో పాల్గొనకుండా ఆదేశించారు.
లక్ష్మి అనే మహిళతో కిరణ్ రాయల్ కు చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆర్థిక సంబంధాలతో పాటు వ్యక్తిగత సంబంధాలు కూడా ఉన్నాయని కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. తనకు కోటి రూపాయలకుపైగా డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వడం లేదని ఆమె ఆరోపిస్తూ తెరపైకి వచ్చారు. వైసీపీ నాయకులే ఆమెను బయటకు తెచ్చి తనను టార్గెట్ చేస్తున్నారని కిరణ్ రాయల్ ఆరోపించారు. అయితే ఆ ఆరోపణలు గాల్లో పుట్టించినవి కావని వివాదం ఉందని అర్థమైంది.
ఎవరి వాదన వారు చెప్పుకున్నారు. ఎవరికి వారు కేసులు పెట్టుకున్నారు. అయితే లక్ష్మిని క్రిప్టోకరెన్సీ కేసులో రాజస్తాన్ పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. వారికి కూడా కిరణ్ రాయలే డబ్బులు ఇచ్చి అరెస్టు చేయించారని లక్ష్మి ఆరోపించారు. ఆమెకు వెంటనే బెయిల్ వచ్చింది. వచ్చిన తర్వాత కూడా ఆమె ఆరోపణలు చేశారు. ఈ ఎపిసోడ్ కు ఇంతటితో ముగింపు ఇవ్వాలనుకున్న కిరణ్ రాయల్..ఆమెతో రాజీ చేసుకున్నారు. ఆమె డిమాండ్ చేస్తున్న డబ్బులు ఇచ్చేసినట్లుగా తెలుస్తోంది. దీంతోఈ వ్యవహారం సద్దుమణిగినట్లే.
అయితే రాజకీయాల్లో.. ప్రజా జీవితంలో ఉన్నవారు ఇలాంటి వివాదాలు మీడియా వరకూ రాకుండా ముందుగానే సెటిల్ చేసుకుంటే .. ప్రజల్లో కాస్త ఇమేజ్ నిలబడే అవకాశం ఉంటుంది. లేకపోతే సమస్యలు వస్తాయి.