జనసేన పార్టీ కిరణ్ రాయల్ విషయంలో విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకుంది. అంతర్గత విచారణ కోసం ఓ కమిటీని నియమిస్తామని నిజాలు నిగ్గు తేలే వరకూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని కిరణ్ రాయల్ కు జనసేన పార్టీ ఆదేశాలు జారీ చేసింది. గతంలో జానీ మాస్టర్ పై ఇలా ఓ మహిళ చేసిన ఆరోపణలతో ఆయన జైలుకు వెళ్లారు. ఆయనకు కూడా ఇవే తరహా ఆదేశాలను జనసేన ఇచ్చింది.
కిరణ్ రాయల్ పై ఓ మహిళ ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేసింది. ఆమె ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే కోలుకుని ఇంటికి వచ్చారు. కిరణ్ రాయల్ తనకు కోటి ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాలని ఆమె అంటున్నారు. ఈ ఘటన సంచలనం సృష్టించడంతో వైసీపీ నేతలు విమర్శలు ప్రారంభించారు. ఓ వీడియో కూడా లీక్ అయింది. దీనిపై కిరణ్ రాయల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పదేళ్ల కిందట ఆర్థిక లావాదేవీల విషయంలో సెటిలైపోయిన విషయాన్ని ఇప్పుడు బయటకు తెచ్చి వివాదం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో పోలీసులు తన ఫోన్ ను స్వాధీనం చేసుకుని డేటా చోరీ చేసి వైసీపీ నేతలకు ఇచ్చారని ఇప్పుడు ఆ డేటాతోనే తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అంటున్నారు.
ఏదైనా.. ఆరోపణలు వచ్చాయి కాబట్టి కిరణ్ రాయల్ ఖండిస్తున్నారు కాబట్టి పార్టీ విచారణ జరిపే వరకూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. అయితే ఈ మాత్రం యాక్షన్ ను తాము అధికారంలో ఉన్నప్పుడు తమ పార్టీ నేతలపై వస్తే వైసీపీ తీసుకోలేదు. పైగా అలాంటి కీచక నేతలకు .. పదవులు ఇచ్చి ప్రోత్సహించారు. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై ఇలాంటి ఆరోపణలు వస్తే సస్పెండ్ చేశారు. తర్వాత ఆ మహిళ కేసు వెనక్కి తీసుకోవడంతో హైకోర్టులో ఆదిమూలంపై కేసును క్వాష్ చేశారు. ఆయనపై ఇప్పుడు ఏ ఆరోపణలు లేవు కానీ ఇంకా సస్పెన్షన్ ను ఎత్తివేయలేదు.