హైదరాబాద్: దీర్ఘకాల విరామం అనంతరం మీడియా ముందుకొచ్చిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి తెలుగురాష్ట్రాలలో పాలనపై స్పందించారు. కృష్ణా నీటికోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ కేంద్రంతో పోరాడాలని సూచించారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ హర్షకుమార్కు చెందిన రాజీవ్ గాంధీ విద్యాసంస్థల సిల్వర్ జుబ్లీ ఉత్సవాల కార్యక్రమంలో కిరణ్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రవిభజనవల్లే నీటి సమస్య ఏర్పడిందన్నారు. విభజనవల్ల నష్టం జరుగుతుందని తాను ముందే చెప్పానని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఇరు రాష్ట్రాలలో తాగునీటికే కాకుండా, సాగునీటికి కూడా ఇబ్బంది ఏర్పడే పరిస్థితి లేకపోదన్నారు. కరవు తరహా పరిస్థితి ఎదురుకానుందని హెచ్చరించారు. ఇద్దరు ముఖ్యమంత్రులూ కలసికట్టుగా ఢిల్లీకి వెళ్ళి కేంద్రంతో పోరాడితేనే ఈ పరిస్థితినుంచి బయటపడే అవకాశాలున్నాయన్నారు.
ఏపీ రాజధానిపై స్పందిస్తూ, అమరావతిపై జరుగుతున్న అన్ని విషయాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని కిరణ్ చెప్పారు. చాలా విషయాలు మాట్లాడాల్సి ఉందని, సమయం వచ్చినపుడు అన్ని విషయాలపై నోరు విప్పుతానని అన్నారు. ఇరువురు సీఎమ్లూ వారు ఇచ్చిన రుణమాఫీ వంటి హామీలను నిలుపుకోవాలని సూచించారు. రైతులకు రుణమాఫీి వ్యవహారం సజావుగా జరగకపోవటంతో రైతులపై అదనపు భారం పడుతోందని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో దాదాపు 6 లక్షల ఇళ్ళ నిర్మాణాలకు అనుమతులివ్వటంతో అవి వివిధ దశలలో ఉన్నాయని, వాటికి సంబంధించి ఇప్పటివరకు రూపాయికూడా చెల్లించకపోవటం దారుణమని అన్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవటానికి ఇంకా సమయం ఉందని కిరణ్ చెప్పారు.